'అమ్మానాన్నలు' ఆధునిక పెంపకంలో జాగ్రత్త - లేకపోతే జీవితాంతం శిక్ష అనుభవించాలి!
తల్లిదండ్రులు పెంపకంపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న నిపుణులు - నేడు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 27, 2025 at 6:21 PM IST
WORLD PARENTS DAY 2025 : పిల్లలు పెరిగే విధానం బట్టే భవిష్యత్తులో వాళ్లు ఎలా జీవిస్తారనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నగర, పట్టణ జీవనంలో పిల్లలకు తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవరూ ఓ సలహా ఇచ్చే పరిస్థితి 90 శాతం కుటుంబాల్లో లేదు. తల్లిదండ్రులు తమ ఉద్యోగాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా రోజుకు కనీసం ఓ గంట చిన్నారులతో గడపాలి. తరగతి గది నేర్పించని ఎన్నో విషయాలపై అవగాహన పెంచాలి. వారికి తల్లిదండ్రులుగానే కాకుండా స్నేహితులుగానూ ఆధునిక తల్లిదండ్రులు ఉండాలి. అప్పుడే వాళ్లు ఏ రంగంలోకి వెళ్లినా విజయాలను అవలీలగా సాధించేందుకు అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఒత్తిడిని తట్టుకోవడం నేర్పించాలి : భావోద్వేగాల నియంత్రణ పిల్లల్లో పెద్ద సమస్యగా మారింది. ఐదేళ్ల పిల్లాడి నుంచి తల్లిదండ్రులు, గురువులపై ఆవేశంతో ఊగిపోతున్న చిన్నారులు ఎక్కువయ్యారు. ఇటీవల ఓ విద్యార్థిని ఉపాధ్యాయినిని అందరిలో తిడుతూ చెప్పుతీసి మరీ కొట్టడం మన తెలుగు రాష్ట్రాల్లోనే చూశాం. కేవలం సెల్‌ఫోన్‌ను ఉపాధ్యాయినిని తీసుకోవడమే తప్పయిపోయింది.
వ్యక్తిత్వం చాలా ముఖ్యం : నేటితరం పిల్లలకు మంచి వ్యక్తిత్వం అలవరిచే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకూ ఎక్కడెక్కడ ఎలాంటి అలవాట్లున్నాయో అన్నీ ఇప్పుడు ప్రతి ఇంటిలోకీ స్మార్ట్‌ఫోన్ల ద్వారా వచ్చేశాయి. చాలామంది పిల్లలు రీల్స్ చూసే చాలా విషయాలు నేర్చుకుంటున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో మంచి కంటే చెడే ఎక్కువ ఉంటోంది. మంచి నడవడిక కూడా పిల్లలను గొప్పస్థానాల్లో కూర్చోబెట్టడానికి దోహదపడుతుంది.
సొంతంగా నిర్ణయం తీసుకునేలా : ప్రస్తుతం చాలామందిలో సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండడం లేదు. ప్రస్తుతం విపరీతమైన పోటీ, అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించాలంటే సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లే సామర్థ్యం ఉండాలి.
సోషల్ మీడియాకు బానిస కానివ్వొద్దు : తల్లిదండ్రులకు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల నుంచే పెద్దసవాలు ఎదురవుతోంది. తిన్నా, పడుకున్నా, కూర్చున్నా చివరికి బాత్రూంలో ఉన్నా సామాజిక మాధ్యమాల్లోనే మునిగి తేలున్నారు. రీల్స్, షార్ట్స్, వీడియో గేమ్‌లతో గడిపేస్తున్నారు. ఇదో విషవ్యసనంలా మారింది. దీనికి విరుగుడు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. చిన్నప్పటి నుంచే నియంత్రించాలి. ఈ ఏడాది ఐఏఎస్ సాధించిన నేహా బైద్వాల్‌ను మీ విజయరహస్యం ఏంటని అడిగితే కొన్ని సంవత్సరాలు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉన్నానని చెప్పింది.
సృజన, వినూత్న ఆలోచనలే ఊపిరి : వచ్చేదంతా కృత్రిమ మేధకు అనుసంధానమైన కాలమే. విద్యార్థులు గొప్ప అవకాశాలను అందుకోవాలంటే తరగతి గదిలో పాఠాలు మాత్రమే చాలవు. సృజన, వినూత్న ఆలోచనలు ఉంటేనే రాణిస్తారు.
ప్రతిభను గుర్తించి : బిడ్డల్లో దాగిన ప్రతిభను ముందుగా గుర్తించేది తల్లిదండ్రులే. ఆయా అంశాల్లో పిల్లలను ప్రోత్సహించి మార్గదర్శకులుగా మారి ఉన్నత స్థాయికి ఎదిగేంతవరకు విశ్రమించరు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడకు చెందిన నంబూరి సుబ్బరాజు, అనురాధ దంపతులు తమ కుమారుడు శివవర్మ వాలీబాల్ బాగా ఆడుతున్నట్లు గమనించి తగిన శిక్షణ ఇప్పించారు. వాలీబాల్ పోటీలుంటే అక్కడకు వెంటబెట్టుకుని తీసుకెళ్లి ఆడించడంతో వర్మ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదగడంతో పాటు రైల్వే కొలువు సాధించారు.
మార్గదర్శకులుగా : పిల్లలకు ఏది అవసరమో గుర్తించి ప్రేమపూర్వకంగా అందించేది తల్లిదండ్రులే. అది వారిలో భద్రతా భావాన్ని పెంపొందించి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన డి.జాహ్నవి వ్యోమగామి కావాలనే లక్ష్యాన్ని చేరడానికి ఆమె తల్లిదండ్రులు పద్మశ్రీ, శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. వారు కువైట్‌లో ఉద్యోగం చేస్తూ కుమార్తెకు కావాల్సినవన్నీ ఎంత ఖర్చయినా సమకూరుస్తున్నారు. జాహ్నవి వచ్చే ఏడాది అమెరికాకు చెందిన టైటాన్స్ స్పేస్ సంస్థ నుంచి అంతరిక్షయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అలసిన మోముల్లో 'చిరు వెలుగులు' : తమ బిడ్డలకు తెలివితేటల్లో లోపం ఉందని ఆ తల్లిదండ్రులు కుంగిపోలేదు. వారిని తీర్చిదిద్దుతూనే తమలాంటి కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారీ దంపతులు. కృష్ణా జిల్లా బందరుకు చెందిన మరీదు కోటేశ్వరి, వెంకట శివనాగేంద్ర ప్రసాద్ భార్యాభర్తలు. వీరి పెద్దమ్మాయి లీలా ప్రసూనాంబిక చిన్నమ్మాయి భానుతేజ. ఒకరికి 20 ఏళ్లు. మరొకరికి 18ఏళ్లు వచ్చినా స్వయంగా అన్నం కూడా తినలేరు. ఎప్పుడూ ఒకరు పక్కనే ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తల్లిదండ్రులు కుంగిపోలేదు.
తమ పిల్లలాంటి వారికి సాయం చేయాలని వీరు తలచారు. భర్త ప్రసాద్ పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు. బీఈడీ పూర్తి చేసిన కోటేశ్వరి తన పిల్లల కోసం ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్సు పర్సన్ (ఐఈఆర్‌పీ) భవిత కేంద్రంలో ఉద్యోగం సాధించారు. మానసిక లోపంతో జన్మించిన పిల్లలను బయటకు తేవడానికే భయపడుతున్న తల్లిదండ్రులకు భరోసాగా నిలుస్తున్నారు. పుట్టుకతో మానసిక సమస్యతో బాధపడుతున్న తమ పిల్లలను ఇంటర్ వరకు చదివించిన ఆమె భవిత కేంద్రంలో శిక్షణతో పిల్లలకు కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.
వెంకటశివనాగేంద్ర ప్రసాద్ సైతం ఇలాంటి పిల్లలకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని వారి సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు 2021లో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికల తల్లిదండ్రుల సంఘం స్థాపించారు. దీనిద్వారా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

తల్లి కోసం గుడి: ఇద్దరు మగ పిల్లలు పుట్టడంతో శరీరం బలహీనపడింది. ఆడపిల్ల కోసం ఆరాటపడ్డారామె. మరో బిడ్డకు జన్మనిస్తే చనిపోతావని వైద్యులు చెప్పినా వినిపించుకోలేదు. మూడోసారి మగపిల్లాడే పుట్టినా ప్రేమను పంచారు. ప్రయోజకుడిగా తీర్చిదిద్దారు. అందుకే అమ్మంటే ప్రాణమని చెబుతున్నారు బొందలపాటి ఫణికుమార్. 1997లో క్యాన్సర్ మహమ్మారి ఆమెను దూరం చేసినా గుడి కట్టించి 18 ఏళ్లుగా పూజిస్తూనే ఉన్నారు. ఇంట్లో, వ్యాపారం చేసేచోట ఆమె ఫొటోలు పెట్టి నిత్యం కొలుస్తున్నారు.
పస్తులుండి : ఫణికుమార్ తండ్రి కాశీపతి కాఫీపొడి వ్యాపారంలో నష్టపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. ముగ్గురు పిల్లల కోసం తల్లి కల్పన ఆలయాల శుద్ధి పనులకు వెళ్లి అక్కడి ప్రసాదం తెచ్చి పిల్లల ఆకలి తీర్చేవారు. వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో రోజుకు ఒకపూట భోజనం చేసేవారు. ఒక్కోరోజు ఆమె పస్తులుండేవారని గుర్తు చేసుకున్నారు ఫణికుమార్. ఆర్థిక ఇబ్బందులతో నాలుగో తరగతితో చదువు ఆపేసిన ఫణికుమార్ శానిటరీ దుకాణంలో పనికెళ్లారు.

అక్కడ ఇబ్బందులు పడలేక సైకిల్‌పై తిరుగుతూ వ్యాపారం ప్రారంభించారు. తల్లి కోరిక మేరకు 2007లో గుంటూరు జిల్లా బుడంపాడులో ఆమె పేరుతో ఇంటిని నిర్మించి తల్లికి గుడి కట్టారు. నిత్యం దీపారాధన చేయటానికి ఒకరిని ఉంచారు. ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో ఫణికుమార్ అక్కడికెళ్లి ఆ ప్రాంగణం శుద్ధి చేసి దీపారాధనలు, పూజలు చేస్తారు. ఆమె కాలం చేసిన రోజు పేదలకు వైద్యశిబిరం నిర్వహించి భోజనాలు పెడుతున్నారు. ఆమె పేరుతో ఛారిటబుల్ ట్రస్టుపెట్టి ఏటా పిల్లలకు పుస్తకాలు, ఉపకార వేతనాలు అందిస్తున్నారు.
మీ పిల్లల్లో ఈ అలవాటు ఉందా - వారిని సరిదిద్దే బాధ్యత మీదే!
మేమేం పాపం చేశాం - తల్లిదండ్రుల మరణంతో రోడ్డుపాలైన చిన్నారులు

