Special Story on Whatsapp Status : సమాచారం పంచునేందుకు ఒకప్పుడు పావురాలతో లేఖలు పంపుకునేవారు. తర్వాత తపాలా వ్యవస్థ. మరి ఇప్పుడు? సామాజిక మాధ్యమాలు. సోషల్ మీడియా అంతా ఒకెత్తైతే వాట్సాప్ ఒక్కటి ఒక్కెత్తు. అందులో స్టేటస్ అయితే చెప్పనవసరం లేదు. వందలో తొంభై మంది పని ఉదయం లేవగానే వాట్సాప్ స్టేటస్‌లు చెక్‌చేయడం, పోస్ట్ చేయడం. అసలు అందులో ఏం ఉంది. దాని వెనకాల తేనే పూసిన కత్తుల్లా ఎలాంటి ఆపదలు దాగి ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆపదల నుంచి బయట పడొచ్చు ఆ వివరాలివి.
ప్రస్తుతం సమాజంలో నడుసున్న ట్రెండ్ ఏంటో తెలుసా? బాధొచ్చిందా వాట్సాప్ స్టేటస్, సంతోషం వచ్చిందా వాట్సాప్ స్టేటస్. ఎటైనా ట్రిప్ వెళ్లారా, వాట్సాప్ స్టేటస్, ఎవరిపైనా కోపం వచ్చిందా మళ్లీ వాట్సాప్ స్టేటస్. యువత లవ్ బ్రేకప్ అయినా కూడా వాట్సాప్ స్టేటసే స్నేహితుడిలా సాంత్వన కోరుకుంటోంది. వాట్సాప్ ఇంతగా మన జీవితాల్ని పెనవేసుకున్న సమయంలో మంచి చెడుల మిశ్రమంగా సాగుతోన్న స్టేటస్ కథ ఇది.
వాట్సాప్ స్టేటస్ మనిషి మానసిక స్థితిని ప్రభావితం చేయడమే కాదు. వ్యక్తి పరిస్థితికి అద్దం పట్టేదిగా మారుతోంది. చాలామంది ప్రతిరోజు దేవుళ్ల స్టేటస్ పెడుతుంటారు. ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రత్యేకంగా స్టేటస్ వేదికగా పూజలు చేస్తుంటారు. మనోభావాలు ఏవైనా వెంటనే వాటిని వ్యక్తపరిచేందుకు వాట్సాప్ స్టేటస్ ను ఎంచుకుంటున్నారు. ఏ పండుగైనా, సన్నిహితుల ప్రత్యేక రోజుల్లోనూ వాట్సాప్ స్టేటస్ శుభాకాంక్షలకు వేదికవుతోంది. అలాగే ఏదైనా సాధించినప్పుడు మనవాళ్లు ఎవరైనా ప్రతిభ కనబర్చినప్పుడు ఆ విషయాన్ని పదిమందికి చేర్చేందుకు, ప్రతిభకు పట్టం కట్టించేందుకు సైతం వాట్సాప్ స్టేటస్ సాయపడుతోంది. అయితే వాట్సాప్ స్టేటస్ పెట్టడమే హోదాగా భావించే వాళ్లు వారు అనుకున్న రీతిలో లైక్‌లు, కామెంట్లు రాకుంటే మాత్రం అసంతృప్తికి సైతం గురవుతున్నారు. ఆయా పరిస్థితుల్లో వారి మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, డాక్టర్లు వివరిస్తున్నారు.
అప్రమత్తత అవసరం : బాధ సంతోషమే కాదు. కోపాన్ని సైతం ప్రదర్శిస్తున్నారు. పనిచేసే చోట వ్యక్తులతో, బంధువులతో మనస్పర్థలు వచ్చినా వ్యంగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. అంతేగాక విజ్ఞానానికి సంబంధించినవి, రాజకీయానికి సంబంధించిన అంశాలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి అవగాహన కల్పించేలా సైతం ఉపయోగిస్తున్నారు. అలాగే వ్యాపార ప్రకటనలకు సైతం వాట్సాప్ స్టేటస్ వేదికవుతోంది. తమ తమ వ్యాపారాలకు సంబంధించిన పోస్టర్లు, లింక్‌లతో తెరపైకి వస్తుంటారు నిర్వహకులు. అయితే నిర్వాహకులకు తెలియకుండానే కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లు లింక్‌ల రూపంలో వచ్చే అవకాశం ఉందని, ఫొటోలు మార్ఫింగ్ చేసే అవకాశం ఉందని, కాస్త అప్రమత్తత అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
స్టేటస్ పెరుగుతుంది : ఏదేమైనా వాట్సాప్ స్టేటస్ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారిలో 90% మందికి దినచర్యలా మారింది. ఒక్కొక్కరు ఒక్కోలా స్టేటస్ పెడుతుంటే మరికొందరు అసలు స్టేటస్ పెట్టకూడదనే కృత నిశ్చయంతో దాన్నే పాటిస్తుంటారు. ఒకరు రోజుకు ఒక స్టేటస్ పెడుతుంటే, మరొకరు జరిగే చిన్న విషయాన్ని అందరితో పంచుకుంటూనే ఉంటారు. మితంగా ఉన్నంత వరకు అన్ని బాగానే ఉంటాయి. అతి కాకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని, మానవ సంబంధాలు పెంచుకునేందుకు వాట్సాప్ స్టేటస్‌ను ఉపయోగిస్తే సమాజంలో మన స్టేటస్ సైతం పెరుగుతుందనేది నిపుణులు చెబుతున్నారు.
సీక్రెట్‌గా ఇతరుల వాట్సాప్ స్టేటస్ చూడాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!