Special Story on Wedding Problems : ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ పెళ్లికాని ప్రసాదుల సంఖ్య అధికమవుతోంది. గతంలో ఆడపిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి అనుకునేవారు. పెళ్లి కుమారుడికి కట్నకానుకలు ఇవ్వడానికి అప్పు చేసేవారు. ఇప్పుడు ఇదంతా పూర్తిగా మారిపోయింది. కట్నం మాట దేవుడెరుగు, అమ్మాయి వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటే చాలు అని అనుకుంటున్నారు చాలా మంది యువకులు. ప్రస్తుతం పెళ్లి విషయంలో సామాజికంగా చాలా మార్పులు వచ్చాయి. ఈ దశాబ్దంలో అన్ని వర్గాల్లోనూ అమ్మాయిల కొరత కనిపిస్తోంది. గతంలో కుటుంబ పెద్దలు చూసిన సంబంధాన్ని మారు మాట్లాడకుండా అమ్మాయిలు పెళ్లి చేసుకునే వారు. ఆడ బిడ్డ అభిప్రాయాన్ని అంతగా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం యువతరం తమ మనోభావాలకు అనుగుణంగా జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారు.
సొంతిల్లు, ఉద్యోగం ఉండాల్సిందే : ఒకప్పుడు కలల రాకుమారి కోసం వచ్చిన సంబంధానికల్లా వంక పెట్టేవారు అబ్బాయిలు. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. అబ్బాయి బాగుండాలి. మంచి వ్యాపారం లేదా ఉద్యోగం చేసైనా 2 చేతులా సంపాదించాలి. సొంత ఇల్లు తప్పనిసరి. చిన్న కుటుంబమై ఉండాలి. ఇలా అమ్మాయిల కోరికలతో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
జీవితంలో మంచిగా స్థిరపడాలని : జీవితంలో స్థిరపడాలి. మంచి ఉద్యోగంలో చేరాలి. ఆర్థికంగా ఎదగాలి. అనే వెంపర్లాటలో యువత వివాహాన్ని వాయిదా వేస్తోంది. 30 దాటాక సరైన జోడీ దొరక్క చాలా మంది ఒంటరిగా మిగిలిపోతున్నారు. మగ వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఇరుగు పొరుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రానికి సరిహద్దు కలిగి ఉంది. సరిహద్దు లోనివారు మహారాష్ట్ర నుంచి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. భాషా, ఇతర వ్యవహారాలు దగ్గరగా ఉండటంతో అక్కడి వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటున్నారు.
- మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఒకరు డబ్బులు బాగా సంపాదించాలని, మంచి బిజినెస్ చేయాలని వివాహం చేసుకోలేదు. అతను ఆర్థికంగా బాగానే ఎదిగారు. వయసు 40కి చేరువైంది. ఆ సామాజిక వర్గంలో పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వేరే సామాజిక వర్గం అమ్మాయిని చేసుకోవాలని మిత్రులు సూచించినా ఇంట్లో పట్టింపులు ఎక్కువ. ఎవరో ఒకరు దొరక్కపోతారా అని వేచి చూశాడు. కానీ ఎవరూ దొరకలేదు. ప్రస్తుతం అతని వయసు 45కు చేరింది. ఇప్పుడు ఏ సామాజిక వర్గం అయినా ఫర్వాలేదనే స్థాయికి వచ్చేశాడు.
- బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి జాబ్ సాధించే వరకు పెళ్లి చేసుకోలేదు. డిగ్రీలు వచ్చాయి. కానీ అతనికి జాబ్ రాలేదు. వయసు దాటి పోయింది. ప్రస్తుతం పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్నత చదువులు చదువుకునే వయసులో అతనికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి. జాబ్ కోసం నిరీక్షించడంతో ఉద్యోగం రాక వివాహానికి అమ్మాయి దొరకడం లేదని బాధ పడుతున్నాడు.
- ఆచారాలు, వృత్తి పాటించే ఓ వర్గంలో ఆదాయం బాగా వస్తోంది. సమాజంలో గౌరవం ఉంది. అదే వృత్తిలో ఉండే కుటుంబాల్లోని ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏదో ఒక జాబ్ చేసే వాడైతే చాలనే భావన వ్యక్తం అవుతోంది.
40 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నా పర్లేదు - ఆరోగ్యకరమైన పిల్లల్ని ఇలా కనండి!
30 దాటాక ఎంత ఆలస్యం చేస్తే అంత కష్టం! - యువతకు గైనకాలజీ డాక్టర్ల అడ్వైజ్