Special Story Sirisha Who scored 5 Govt Jobs : పేదింటి అమ్మాయి. దీనికి తోడు చిన్నతనం నుంచి ఆరోగ్య సమస్యలు. 'ఇలాంటప్పుడు చదువెందుకు? డబ్బు దండగ కాకపోతే' అన్నారు. ఆమె మాత్రం చదవాలి అనుకుంది. శరీరమంతా బాధిస్తున్నా, పట్టుదలగా చదివింది. తాజాగా గ్రూప్-1 సాధించింది జంగం జ్యోతి శిరీష. ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జంగం జ్యోతి శిరీషది ఖమ్మం జిల్లాలోని మిట్టపల్లి గ్రామం. తండ్రి పౌలు సుతారీ మేస్త్రీ, తల్లి శారదమ్మ వ్యవసాయ కూలీ. చెల్లి స్పందన డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుక్కుంటుంది. శిరీషకు చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రైవేటు స్కూళ్లలో చదివే స్థోమత లేక గురుకుల పాఠశాలల్లో చదువుకుంది. ఆపై డిగ్రీ సార్వత్రిక విద్య ద్వారా చదివారు. ఉస్మానియాలో పీజీ చేసిన తర్వాత టీటీసీ, బీఈడీ చేసి సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. వరుసగా విద్యార్హతలు పెంచుకుంటూ పోయానని అనిపిస్తున్నా, శిరీష విద్యా జీవితం అంత సులువుగా ఏమీ సాగలేదు.
యాభై సార్లు రక్తం ఎక్కించుకుని : శిరీష చిన్నప్పటి నుంచే సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతుంది. తను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఈ సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధితో బాధ పడుతున్న వారికి తరచూ రక్తం తగ్గిపోయి కాళ్లు, చేతులు వాస్తాయి. వీటితో పాటు తలనొప్పి, ఎముకల మధ్య సూదులతో గుచ్చినట్లు ఉంటుంది. ఇవన్నీ భరిస్తూనే పరీక్షలకు సన్నద్ధమైంది శిరీష. ఇప్పటి వరకు 50 సార్లు రక్తం ఎక్కించుకున్నారంటే ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వాళ్లది. అది సరిపోనట్టుగా తన అనారోగ్యం వల్ల స్నేహితులు, బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంది. అయినా అమ్మానాన్నలు తనను సపోర్ట్ చేసేవారు. కూలీ పనులు చేస్తూ తన వెన్నంటే నిలిచారు. చదువయ్యాక శిక్షణ తీసుకుంటూ సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. విజేతగా నిలవాలని కసితో చదినింది.
వరుస కట్టిన ప్రభుత్వ ఉద్యోగాలు : నేను పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో స్నేహితుడు, మేనమామ సాయాన్ని మర్చిపోలేను. నిజానికి గతేడాది గ్రూప్-4 ఉద్యోగానికి ఎంపికయ్యాను. అప్పుడే గురుకుల టీచర్ ఫలితాల్లో ర్యాంకు సాధించాను. అది వద్దనుకుని దానవాయిగూడెం బీసీ గురుకులంలో ఉపాధ్యాయురాలిగా చేరాను. మూడు నెలలు గడిచిన తర్వాత గత అక్టోబరులో డీఎస్సీ ఫలితాలు వెలువడటంతో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్‌ను అయ్యాను. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 45.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 604 ర్యాంకు సాధించాను.
ఎస్సీ జనరల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 25వ ర్యాంకు సాధించిన శిరీష, ఎస్సీ మహిళల కోటాలో ఏడో ర్యాంకు దక్కించుకుంది. దీంతోనే ఆగిపోకుండా సివిల్స్ సాధించడమే తన లక్ష్యమంటుంది. ప్రస్తుతం వైద్యుల సూచనలతో ఆరోగ్యం కుదుటపడింది. తన విజయం కొంతమంది ఆలోచనలనైనా మార్చాలని అదే తన ఆశ అంటోంది ఈ గ్రూప్-1 విజేత.
YUVA : మూడేళ్ల ప్లానింగ్, రోజుకు 10 గంటల ప్రిపరేషన్ - చివరకు నెరవేరిన లక్ష్యం
YUVA : పేదలకు సేవ చేయడమే లక్ష్యం - సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గ్రూప్-1 సాధించిన యువకుడు
YUVA : గ్రూప్స్ అన్ని పరీక్షల్లోనూ ఉద్యోగాలు - తన సక్సెస్ సీక్రెట్ర్ చెబుతున్న హైదరాబాద్ యువతి