ETV Bharat / state

సేంద్రియ వ్యవసాయంతో దిగుబడులు - సొంత మార్ట్​ పేరుతోనే ఇంటింటికీ అమ్మకాలు

ఏకంగా 55 ఎకరాల్లో సేంద్రియ సాగు - 650 మందితో వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు

AP Farmers Chemical Free Food Products
AP Farmers Chemical Free Food Products (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 29, 2025 at 11:52 AM IST

3 Min Read
Choose ETV Bharat

AP Farmers Chemical Free Food Products: ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్న ఉదంతాలు చూస్తున్నాం. ఇందుకు భిన్నంగా మార్కెట్‌ నాడిని పట్టి కొత్త దారిలో పయనించిన అన్నదాతలు లాభాలు కళ్లజూస్తున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇందుకు సేంద్రియ వ్యవసాయ మార్గాన్ని ఎంచుకున్న పలువురు రైతులే దీనికి నిదర్శనం.

వీరు రసాయన ఎరువుల వాడకాన్ని నివారించి, తమ పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకున్నారు. తాము పండించిన ప్రకృతి ఉత్పత్తులను స్వయంగా మార్కెట్‌ చేసుకుంటున్నారు. బయట ధరలతో పోల్చిస్తే, ఆరోగ్యకరమైన తమ ఉత్పత్తులకు వినియోగదారులు అధిక ధర చెల్లించడానికి ముందుకొస్తుండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

5 kg rice packets ready for sale
అమ్మకానికి సిద్ధం చేసిన 5 కిలోల బియ్యం ప్యాకెట్లు (EENADU)

55 ఎకరాల్లో సేంద్రియ సాగు: గుంటూరు జిల్లా చెందిన దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామ సర్పంచ్​ పాటిబండ్ల కృష్ణప్రసాద్‌ గత ఆరు సంవత్సరాలుగా తన సోదరుడు మురళీతో కలిసి 55 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. తొలి ఏడాది ఆశించిన దిగుబడులు రాకపోయినా, వెనుకడుగు వేయకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో ముందుకెళ్లారు. గత ఏడాది స్వయంగా 35 ఎకరాల్లో వరి సాగు చేశారు. సేంద్రియ పంటకు డిమాండ్​ ఉండడంతో, ఈ ఏడాది అతను తన పొలం పక్కనే ఉన్న మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని బీపీటీ 5204 రకం వరి వేశారు.

armer Patibandla Krishna Prasad
ట్రాక్టర్‌ డ్రైవర్‌కు సూచనలిస్తున్న రైతు పాటిబండ్ల కృష్ణప్రసాద్‌ (EENADU)

ఎకరాకు సుమారు రూ.1.16 లక్షల: మొదట పచ్చిరొట్ట, ఆముదపు పిండి వేసి కలియదున్నారు. తెగుళ్లు రాకుండా నివారించేందుకు రెండుసార్లు కషాయాన్ని పిచికారీ చేసేవారు. పురుగు వస్తే 10 రకాల ఆకులతో చేసిన దశపర్ణి కషాయం పిచికారీ చేస్తున్నారు. వీటి కోసం ఆవుపేడ, గోమూత్రం వంటివి వాడతున్నారు. దీనికోసం 10 ఆవులు, 12 దూడలు పెంచుతున్నారు. అన్ని ఖర్చులూ కలిపి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుందని తెలిపారు.

ఎకరాకు 27-28 బస్తాలు దిగుబడి వచ్చిందని చెప్పారు. ధాన్యాన్ని అమ్మకుండా బియ్యంగా మర పట్టిస్తున్నాము. బస్తాకు 47-48 కిలోల వరకు బియ్యం వస్తుండగా కిలో రూ.90 చొప్పున విక్రయిస్తున్నాము. దీంతో బస్తాకు రూ.4,230 చొప్పున ఎకరాకు సుమారు రూ.1.16 లక్షల వరకు ఆదాయం వస్తోంది అని కృష్ణప్రసాద్‌ తెలిపారు. మొదట్లో మార్కెటింగ్‌ చేయగలమా అని సందేహించినా, బియ్యాన్ని వినియోగదారులు తమ ఇంటికే వచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు.

Farmer Rawada Mohan Rao
రైతు రావాడ మోహనరావు (EENADU)

సొంత మార్ట్‌ పేరుతోనే ఇంటింటికీ అమ్మకాలు: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహనరావు. ఈయన ఐదు ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు. 2020లో 5 ఎకరాల్లో కూరగాయలు, రాగులు, వేరుశనగ తదితర పంటలు వేశారు. సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగుతున్నందున ప్రస్తుతం 25 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రానికి 'వాసుదేవ ఆర్గానిక్‌ ఫామ్‌' అని పేరు కూడా పెట్టారు. కూరగాయలు, ఆకుకూరలు, రాగులు, జొన్న, కొర్రలు, అందుకొర్రలు, వేరుశనగ, చెరకు, మొక్కజొన్న, స్వీట్‌కార్న్, మునగ, నిమ్మ, బత్తాయి, వాటర్‌ యాపిల్, స్టార్‌ఫ్రూట్, సపోట, జామ పంటలను సాగు చేస్తున్నారు.

ఈయన మొదట్లో ఐదు దేశవాళీ ఆవులు కొనుగోలు చేశారు. ప్రసుత్తం తన వద్ద 60 వరకు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రకృతి సేద్యంలో భాగంగా ఆవు పేడ, గోమూత్రం, జిల్లేడు, సీతాఫలం, వేపాకులు మొదలైనవి వినియోగించి కషాయాలు, ఘన జీవామృతం తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నామని తెలిపారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తున్నమని చెప్పారు. పండించిన సేంద్రియ ఉత్పత్తులను సొంతంగా మార్కెట్‌ చేస్తున్నామన్నారు.

నరసన్నపేటలో మన మార్ట్‌ పేరుతో దుకాణం ఏర్పాటు చేశాము. క్షేత్రంలో పండించిన పంటలను ప్రతి రోజూ 100 కిలోల వరకు ఆటోలో తరలిస్తూ విక్రయిస్తున్నాము. 650 మందితో వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేశాము. అందుబాటులో ఉన్న కూరగాయలు, ఇతర పంటల వివరాలు, వాటి ధరలను అందులో పోస్టు చేస్తాము. వచ్చిన ఆర్డర్ల మేరకు ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం అని మోహనరావు వెల్లడించారు.

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న జీవిత ఖైదీలు - రోజుకు రూ.180 సంపాదన

సేంద్రీయ వ్యవసాయంతో ఏటా లక్షల్లో ఆదాయం- రూపిందర్ కౌర్ సక్సెస్ స్టోరీ ఇదే!