ETV Bharat / state

జనసేన ది రైజ్ అండ్ రూల్ - 12 ఏళ్ల విజయప్రస్థానం

రాష్ట్ర విభజన తీరుపై ఆగ్రహంతో జనసేన పార్టీ ఆవిర్భావం - రాజకీయాల్లో జనసేనది ఓ ప్రత్యేక ప్రయాణం - అన్నింటా తగ్గి, నెగ్గిన విజయప్రస్థానం

JANASENA 12 YEARS JOURNEY
JANASENA 12 YEARS JOURNEY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 13, 2025 at 11:01 PM IST

5 Min Read
Choose ETV Bharat

JANASENA 12 YEARS JOURNEY: ''ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు''!! ఇది పవన్‌కల్యాణ్‌ నటించిన సినిమాలోని ఓ డైలాగ్. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్‌కల్యాణ్. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటూ జనసేన పార్టీ ఏర్పాటుచేసిన ఆయన, పదేళ్లపాటు కనీసం చట్టసభలో అడుగుపెట్టలేకపోయారు. ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరించారు. వైఫల్యాలకు వెరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు.

వెన్నుచూపకుండా ప్రజాక్షేత్రంలోనే కలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించి కట్టుబడ్డారు. టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టడంలో కీలకమయ్యారు. పదేళ్ల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో భాగస్వామి అయ్యారు. ప్రజాపాలనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆవిర్భావం, పోరాటం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరపురాని ఘట్టాలు! పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పార్టీ ఒడుదొడుకులు, విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం.

ప్రశ్నించే గొంతుకలా సుదీర్ఘ ప్రయాణం: 2014లో రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించిందంటూ పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహించారు. ఈ అన్యాయం గురించి, ఏపీ హక్కుల గురించి ప్రశ్నించే గొంతుక కోసమంటూ అదే ఏడాది మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటుచేశారు. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అప్పటికే కాంగ్రెస్‌లో విలీనమైంది. ఈ నేపథ్యం జనసేన పార్టీ పైన, పవన్‌ కల్యాణ్‌పైనా అనుమానాలకు తావిచ్చింది.

ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలకు సమయమూ తక్కువగానే ఉండటంతో పోటీకి దిగకుండా బీజేపీకి మద్దతు పలికారు. తెలుగుదేశం కూడా NDA కూటమిలో ఉండటంతో ఏపీలో టీడీపీ విజయం కోసం పనిచేశారు. అలా పవన్‌ తీసుకున్న నిర్ణయం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేకహోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్‌, బీజేపీతోపాటు, టీడీపీపైనా విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కాకుండా వామపక్షాలు, BSPతో కలిసి పోటీచేశారు.

వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు కూడగట్టిన పవనిజం - ఏపీ రాజకీయాల్లో 'పవర్' స్టార్ - game changer in ap politics

ఓటములకు వెన్నుచూపని నైజం: 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్‌కల్యాణ్‌ స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమిపాలయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో అరాచక పాలన సాగటం చూసిన ఆయనకు పొరపాటు అర్థమైంది. జగన్‌ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు. ఇసుక కొరత నుంచి, గుంతలమయమైన రహదారులు వంటి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఇదే క్రమంలో 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోనంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు.

మొండిపట్టుదలతో పార్టీని నడిపించిన సేనాని: పొత్తులపై ప్రకటన చేసినప్పటి నుంచి జనసేనపై వైఎస్సార్సీపీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. విశాఖ పర్యటనకు వెళ్తే పవన్‌ని పోలీసులు అడ్డుకున్నారు. కారులో నుంచి బయటకు చూడొద్దని ఆంక్షలు పెట్టారు. హోటల్ గదిలో నిర్బంధించారు. ఇవన్నీ పవన్‌లో తీవ్ర అసహనం, ఆగ్రహం తెప్పించాయి. తన పర్యటనల కోసం పవన్‌ ప్రత్యేకంగా తయారుచేయించుకున్న వారాహి వాహనంపైనా వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేశారు. అదే వారాహి వాహనంపై 2023 మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు పవన్‌ వెళ్లారు. జనసైనికులు వారాహియాత్రలో కదంతొక్కారు. జగన్‌ ప్రభుత్వాన్ని కూలగొడతానని పవన్‌ ఆ సభలో చేసిన శపథం పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం నింపింది.

అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించిన పవన్: జనసేన ఆవిర్భావ సమయంలో పవన్‌కల్యాణ్‌ వెంట చెప్పుకోదగిన నాయకులు లేరు. పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు. సినిమా హీరోగా చరిష్మా, ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలే ఆయనకు ప్రధాన బలాలు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం కోసం ఇంకా చాలా కావాలి. రాజకీయ ఎత్తుగడలు, బలమైన నాయకులు, పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. వీటిపై సరిగ్గా దృష్టి సారించకపోవడం వల్ల జనసేన 2019 ఎన్నికల్లో విఫలమైంది. గెలిచిన ఒక్క MLA కూడా వైఎస్సార్సీపీ పంచన చేరారు. పార్టీ తరఫున పోటీచేసిన కొందరు నాయకులూ జనసేనను వీడివెళ్లారు. కష్టకాలంలోనూ పవన్‌ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపారు. రాజకీయ వ్యూహాలతోపాటు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచించారు. పంథా మార్చుకొని వెంటనే బీజేపీతో జట్టుకట్టారు. ఆ పార్టీతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలిచారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుని కలిసి వచ్చాక టీడీపీతో పొత్తును ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు.

పవన్‌ అంటే వ్యక్తి కాదు తుపాను: జనసేన అధినేతపై మోదీ ప్రశంసలు - Modi Praises Pawan Kalyan

సవాల్‌ని నిజం చేసి చూపారు: పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కూడా ఒప్పించి 2024 ఎన్నికల నాటికి టీడీపీ NDAలోకి రావడంలో కీలకంగా నిలిచారు. ఈ క్రమంలో పవన్‌పై వైఎస్సార్సీపీ విమర్శలతో విరుచుకుపడింది. ప్యాకేజీస్టార్‌ అని, చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న జగన్‌, పవన్‌ వ్యక్తిగత జీవితంపైనా విమర్శలతో అక్కసు వెళ్లగక్కారు. సొంత సామాజికవర్గం నేతలతో పవన్‌ను అదేపనిగా తిట్టించారు. జగన్‌ ఎత్తులన్నింటినీ, టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పవన్‌ తిప్పికొట్టారు. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కితీరతానని సవాల్‌ విసరడమే కాకుండా నిజం చేసి చూపారు పవన్.

జగన్‌ అరాచక పాలనతో వణికిపోతున్న ప్రజలకు పవన్‌ మాటలు, కూటమి ఏర్పాటు కొండంత ధైర్యాన్నిచ్చాయి. 2024 ఎన్నికల్లో కూటమికి జనం జైకొట్టారు. ఎన్నడూలేనంతగా అఖండ విజయాన్ని కట్టబెట్టారు. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగగా వందశాతం స్ట్రయిక్‌రేట్‌తో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వంలో భాగమైంది. ఉపముఖ్యమంత్రిగానూ, వివిధ కీలక శాఖల మంత్రిగానూ పవన్‌ తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికీ కూటమిలో చిచ్చుపెట్టేందుకు వైఎస్సార్సీపీ చేయని ప్రయత్నాలు లేవు. వాటన్నింటికీ చంద్రబాబుతో కలిసి పవన్‌ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు.

పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీట్లు దక్కనివారిలో కొందరికి నామినేటెడ్ పదవుల ద్వారా పవన్‌ న్యాయంచేశారు. పార్టీ నేతలపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడానికీ పవన్ వెనుకాడటం లేదు. జానీ మాస్టర్‌, కిరణ్‌ రాయల్‌ వంటి వివాదాలకు కేంద్రంగా నిలిచినవారికి పార్టీ దూరం పెట్టింది. వైద్యురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి తమ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే పార్టీ నిర్మాణం విషయంలో జనసేన ఇప్పటికీ వెనుకబడింది. సభ్యత్వ నమోదు 10 లక్షలు దాటినప్పటికీ గ్రామస్థాయి నుంచి కమిటీలు లేకపోవడం ప్రధాన లోపం. పార్టీ అనుబంధ విభాగాలు కూడా క్రియాశీలకంగా లేవు. ఈ తరుణంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ద్వారా పార్టీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇన్నాళ్లూ రాజకీయపార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవడం జనసైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలను నింపుతోంది.

వైఎస్సార్సీపీ లెక్కలు తేల్చిన పవన్​- ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ - sensation in AP politics