Special Story on International Tea Day 2025 : ఉదయం నిద్ర లేవగానే కాఫీ కావాలా? టీ కావాలా? అని అడిగితే టీ కావాలని ఠక్కున చెప్పేస్తారు చాలామంది. హాట్ హాట్ టీ గొంతులో పడిందంటే చాలు ఆ రోజంతా చాలా ఉత్సాహంతో ఉంటాం అంటారు. అంతేకాదండోయ్ ఉదయం నుంచి ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమై సాయంత్రానికి ఇంటికి చేరగానే చాయ్‌ను సిప్ చేస్తే అలసట అంతా మటుమాయం అవ్వాల్సిందే. ఇంటికి ఎవరైనా బందువులు వచ్చినా బయట నలుగురు ఫ్రెండ్స్ కలిసినా? టీ కచ్చితంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సాధారణ ప్రజలకి మాత్రమే కాదండోయ్ రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, సీఎంలు ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు ఒక్కచోట కలిశారంటే ముందుగా ఉండేది తేనీటి విందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ చర్చలు అక్కడే జరుగుతుంటాయి.
ఇరానీ చాయ్.. తాగరా భాయ్ : హైదరాబాద్ నగరం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఇరానీ చాయ్’. ఈ స్పెషల్ తేనీరుకు భాగ్య నగరానికి వందల ఏళ్ల అనుబంధం ఉంది. ఇరానీలు, పార్సీలు ప్రారంభించిన ఈ చాయ్‌తోపాటు సమోసా ఉస్మానియా బిస్కెట్ తింటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం పలు రకాల పేర్లతో నగరవ్యాప్తంగా అనేక టీ ఫ్రాంచైజీలు వచ్చినా ఇరానీ చాయ్‌కి ఏమాత్రం వన్నె తగ్గలేదు. ఆ టీ కోసం చాయ్ లవర్స్ ఇరానీ హోటల్ ఎక్కడుందా అని వెతుక్కుని మరీ వెళ్తారు.
ఎన్ని వెరైటీలో : తలనొప్పి వస్తే మాత్రలు అవసరం లేదు! ఓ కప్పు హాట్ టీ తాగితే చాలు. కొందరు ఎప్పుడూ ఒకేరకమైన టీని తాగుతుంటారు. ఇంకొందరు భిన్నంగా బాదం, అల్లం టీ, దమ్, లెమన్, బ్లాక్, మింట్, హనీ, గ్రీన్, కేసర్, పెప్పర్, మసాలా ఇలా రకరకాలు కోరుకుంటారు. మీ రుచికి అనుగుణంగా కావాల్సిన విధంగా ఆన్‌లైన్‌లో టీ బ్యాగులు లభిస్తాయి. కొన్ని దేశాల్లో కేవలం డికాక్షన్ను మాత్రమే తాగుతారు. అందులో పాలు, షుగర్‌ను కలపడానికి ఇష్టపడరు.
రూ.7 నుంచి రూ.1,000 వరకు : ఈ రోజుల్లో ఏ చిన్న చాయ్ బండి వద్దకు వెళ్లినా టీ ధర రూ.7. ఎంచుకున్న వెరైటీ ఆధారంగా ధరల్లో వ్యత్యాసమనేది ఉంటుంది. నగరంలో ప్రసిద్ధి చెందిన నిలోఫర్ కెఫేలో ‘మైజన్ గోల్డెన్ టిప్స్ టీ’ ఒక కప్పు ధర రూ.1,000గా ఉంది. అస్సోం పండించే అరుదైన రకం తేయాకులతో ఈ టీ తయారు చేస్తారు. ఇదే దీని ప్రత్యేకత.
గ్రీన్ టీ సరే - జామ, యాపిల్ "టీ" టేస్ట్ చేశారా? - సూపర్ టేస్ట్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్!
రోడ్ సైడ్ టీ సూపర్ టేస్టీగా ఉంటోందా? - సీక్రెట్ తెలిస్తే జన్మలో బయట చాయ్ తాగరు!