ETV Bharat / state

మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా ? - వారి అవసరాలు తీరేలా ఇంటిని తీర్చిదిద్దుకోండిలా!

వృద్ధుల రక్షణకు ప్రత్యేక డిజైన్లు - ఆహ్లాదకరంగా, అవసరాలకు అనుగుణంగా ఇంటీరియర్‌ డిజైన్లు

Interior Design and Room for Elders
Interior Design and Room for Old Age People (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : December 7, 2024 at 1:53 PM IST

2 Min Read
Choose ETV Bharat

Interior Design and Room for Old Age People : గృహ నిర్మాణ రంగంలో అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులు వస్తున్నాయి. ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా డిజైన్లు వస్తున్నాయి. చిన్న పిల్లల కోసం ప్రత్యేక గదులు, ఆకట్టుకునేలా రూంలో చిత్రాలు, బంధువులు, అతిథులను ఆకర్షించేలా హాల్​ నిర్మాణం, వెంటనే నిద్ర వచ్చేలా బెడ్​రూం, గృహిణులు అభిరుచులను తెలిపేలా వంట గది.. ఇలా ఎన్నో ప్రతి ఒక్కరి ఆలోచనలు డిజైన్లలో ప్రస్ఫుటమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో వృద్ధుల కోసం ప్రత్యేక నిర్మాణం, ఇంటీరియర్‌ డిజైన్లు రూపొందించడం ప్రస్తుతం ట్రెండ్​గా మారింది.

రాష్ట్రంలో విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్న కుటుంబాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు అక్కడే చదివి, ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకుని ఇల్లు కొనగోలు చేసి కొన్నాళ్లకు అక్కడి పౌరసత్వం తీసుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం వారు పుట్టి పెరిగిన దేశం విడిచిపెట్టి వెళ్లలేక ఇక్కడే గేటెడ్‌ కమ్యూనిటీల్లో అపార్ట్​మెంట్​లో ఒంటరిగా కాలం గడుపుతున్నారు. వీరిలో వయోభారం పెరుగుతున్న కొద్దీ కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.

Interior Design and Room for Elders
రౌండ్‌ ఎడ్జ్‌ ఫర్నిచర్‌ (ETV Bharat)

ఇంట్లో వృద్ధులకు అనువుగా ఉండే వాతావరణం ఉండేలా చూసుకోవాల్సి ఉంది. వారి అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణంలో, ఇంటీరియర్‌ డిజైన్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంది. ఇంట్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వృద్ధుల కోసం రూపొందించిన దృఢమైన రౌండ్‌ ఎడ్జ్‌ ఫర్నీచర్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. సోఫాలు, కుర్చీలకు హ్యాండ్‌ రెస్ట్‌లు ఏర్పాటు చేయడంతో వాటిని పట్టుకొని నిలబడేందుకు వీలుగా ఉంటాయి. వృద్ధులు వంట చేసే సమయంలో గంటల తరబడి నిలబడే ఇబ్బంది లేకుండా, ఎత్తులో ఉన్న వస్తువులను పట్టుకునే క్రమంలో జారి పడిపోకుండా మినీ కిచెన్‌ డిజైన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కూర్చొని వంట చేసేలా ఇవి ఉపయోగపడతాయి.

Interior Design and Room for Elders
మోషన్‌ సెన్సార్‌ లైటింగ్ (ETV Bharat)

జారి పడకుండా యాంటీ స్కిఢ్​ ప్లోరింగ్​ : సాధారణంగా వృద్ధుల్లో అనేక మంది బాత్‌రూమ్‌లో జారి పడుతుంటారు. అలా కాకుండా యాంటీ స్కిఢ్​ ప్లోరింగ్​, చేతికందేలా క్లోజెట్‌లు, కూర్చొని స్నానం చేసేలా స్టూల్‌ లేదా సీటింగ్‌ డిజైన్‌లు అందుబాటులోకి వచ్చాయి. హాట్, కోల్డ్‌ బర్న్‌లను నివారించేలా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు చేసే వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చింది.

మోషన్‌ సెన్సార్‌ లైటింగ్​ : వృద్ధుల్లో చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది. చేయి పట్టుకుని నడిపించేవారు లేకపోతే నడవం కష్టమే. అలాంటి పరిస్థితిలో విద్యుద్దీపాల స్విచ్‌లు ఆన్, ఆఫ్‌ చేయడానికి వెళితే ప్రమాదం జరిగే అవకాశం లేకపోదు. ఈ నేపథ్యంలో మోషన్‌ సెన్సార్‌ లైట్లకే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. మనిషి కదిలికల ఆధారంగా లైట్​ ఆన్​, ఆఫ్​ అవుతుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండదు.

Interior Design and Room for Elders
యాంటీ స్కిఢ్​ ప్లోరింగ్ (ETV Bharat)