Special Drive for Child Laborers in Guntur District: ఎంతో అందమైన బాల్యం దుకాణాలు, హోటళ్లు, వివిధ సంస్థల్లో పనులు చేస్తూ నలిగిపోతోంది. ఆటపాటలతో చదువుకోవాల్సిన వయసులో కుటుంబ భారాన్ని నెత్తిన మోస్తూ జీవనం సాగిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి అండా లేని ఇంకొందరు కూడా దొరికిన పని చేసుకుంటూ బతుకును సాగిస్తున్నారు. ఇలాంటి చిన్నారులు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం నేరమే అయినా కొన్ని యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఏటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాలలను గుర్తించినట్టు కేసులు నమోదవుతున్నా బాల కార్మికుల రహిత సమాజ రూపకల్పన మాత్రం సాధ్యపడడం లేదు.
కేసుల నమోదుతో పాటు కఠిన చర్యలు: కార్మిక చట్టం ప్రకారం 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలలను పనుల్లో పెట్టకూడదు. కౌమారదశలో ఉన్నవారిని ఎలాంటి పనుల్లో పెట్టుకోవచ్చు అనే షరతులు ఉన్నాయి. వారికి కనీస వేతనంతోపాటు పలు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ప్రమాదకరమైన పనుల్లో వారిని పెట్టకూడదు. ప్రాణానికి హాని కలిగించే పనులు చేయిస్తే కేసుల నమోదుతో పాటు కఠిన చర్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో జూన్ 2 నుంచి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది.
6 ఏళ్లలో 272 కేసులు: ప్రతి సంవత్సరం నిర్వహించే తనిఖీల్లో పిల్లలను గుర్తించిన తర్వాత అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక డ్రైవ్‌ను పక్కాగా నిర్వహించాలని ఆ దిశగా అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ సమీక్షలో పేర్కొన్నారు. గత 6 ఏళ్లలో చేపట్టిన తనిఖీల్లో 272 కేసులు నమోదయ్యాయి.
బాల కార్మికుల సమాచారం తెలియజేయాలి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇళ్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు, ఎక్కడైనా బాల కార్మికులతో పని చేయిస్తుంటే సమాచారం అందించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవి తెలిపారు. నెల రోజుల పాటు బాలకార్మికుల గుర్తింపునకు కార్యాచరణ చేపట్టామని ఆలానే వారి సమాచారాన్ని కార్మికశాఖ కార్యాలయం నంబరు 94925 55157కు అందించాలని అన్నారు.
ఆడుకునే వయసులో ప్రసవాలు - పెరిగిపోతున్న చిన్నారి పెళ్లి కూతుళ్లు
గుట్టుచప్పుడు కాకుండా చిన్నారుల పెళ్లి - అధికారులు ఏం చేస్తున్నారో?