Son Meet Parents After Eleven Years in Medak District : సమాజంలో మంచి పౌరునిగా బ్రతకాలి. మంచి ఆస్తి సంపాదించాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మంచి బిజినెస్ పెట్టాలన్న ఆలోచనతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో 2014లో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీ నగర్ చెందిన తేజ సాయి. అలా 11 సంవత్సరాలు గడిచింది.
తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం : తమ కుమారుడి ఆచూకీ కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో తల్లిదండ్రులు నిరాశ చెందారు. ఫలితం లేకపోవడంతో వారం క్రితం మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి తమ గోడును వెలిబుచ్చారు. దీంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు తీసుకొని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్తో విచారణ ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తేజ సాయిని పోలీసులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. తేజ సాయిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఆనందంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఒక కుటుంబం ఆశల కథ : 11 సంవత్సరాలుగా ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్లావని ఎస్పీ తేజ సాయిని అడగగా తన తండ్రికి రెండు ఎకరాల వ్యవసాయ పొలం మాత్రమే ఉందని, దానితోనే బ్రతకడం కష్టమని ఆలోచించి మంచిగా బతికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, సమాజంలో మంచి గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిపారు.
ఇలా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సాయి ఆవారా తిరుగులు తిరగకుండా పెళ్లి చేసుకొని మంచి బిజినెస్ పెట్టి ఆర్థికంగా తనకు తాను మంచిగా స్థిరపడ్డాడని ఎస్పీ తెలిపారు. ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల మీద ఆధారపడే వారికి ఇది ఒక మంచి గుణపాఠమని అన్నారు. ఈ కేసు కేవలం ఒక యువకుడి గల్లంతు కేసు కాదనీ, ఇది ఒక కుటుంబం ఆశల కథ అని ఎస్పీ వివరించారు. 11 సంవత్సరాలు కేసును చేధించడంలో పలువురు పోలీసుల పని తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"సమాజంలో మంచి గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో తేజ సాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. సాయి ఆవారా తిరుగుళ్లు తిరగకుండా బిజినెస్ పెట్టి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇది కేవలం ఒక యువకుడి గల్లంతు కేసు కాదు. ఇది ఒక కుటుంబం ఆశల కథ. ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల మీద ఆధారపడే వారికి ఇది ఒక మంచి గుణపాఠం."- ఉదయ్ కుమార్ రెడ్డి, మెదక్ ఎస్పీ
30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమార్తె - అసలు ఏం జరిగిందంటే?