చిన్నారులే లక్ష్యంగా సైబర్ నేరాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ అంటున్న అధికారులు
గంటలు తరబడి ఫోన్లకు అతుక్కుపోతున్న చిన్నారులు - ఆటపాటలు సైతం ఆన్లైన్లోనే - దీనినే అదునుగా చేసుకుని రెచ్చిపోతున్న సైబర్ నేరస్థులు - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

Published : October 13, 2025 at 9:00 PM IST
|Updated : October 14, 2025 at 5:20 PM IST
Cyber Crime Related To Children : కరోనా దెబ్బకు లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన పిల్లలు ఆన్లైన్ విద్యకు బాగా అలవాటుపడ్డారు. అప్పటి నుంచి వారికి సెల్‌ఫోన్ అనివార్యమైంది. అదే క్రమంలో చిన్నారులు ఆటపాటలను సైతం ఫోన్లలో ఆన్లైన్లోనే సాగిస్తున్నారు. ముఖ్యంగా రీల్స్ చేస్తూ, చూస్తూ పలు సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్టు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అధికంగా ఫోన్ వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే దీనినే అదునుగా చేసుకుని సైబర్ నేరస్థులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
మరింత సులభంగా మోసాలు : చిన్నారులు ఫోన్ వినియోగించడం వల్ల సైబర్ నేరగాళ్లు మోసం చేయడం మరింత సులభం అవుతుంది. నేరగాళ్లు ఆన్లైన్లో లింక్‌లను పంపించడంతో పాటు వేరే డివైజ్‌లలో వీటిని ఓపెన్ చేయాలని కోరుతున్నారు. తెలిసీతెలియని చిన్నారులు అ లింకులను క్లిక్ చేస్తున్నారు. వాటిని తెరవగానే బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలని పలుమార్లు పోలీసుశాఖ హెచ్చరికలతో పాటు పలు సూచనలు జారీ చేస్తోంది.
ఆట పాటలన్నీ ఫోన్లపైనే : ఉదయం లేచిన నుంచి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సైతం తమ పాఠ్యాంశాలతో పాటు ఆట, పాటలకు ఫోన్‌పైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు సైతం : నేటి రోజుల్లో సైబర్ నేరాలకు ఎవరూ అతీతులు కారు. ముఖ్యంగా చదువుకున్న, టెక్నాలజీ గురించి తెలిసిన వారే బాధితులుగా మారుతున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నేరుగా ఓ వేదికగా తన కుమార్తె గురించి బహిరంగంగా వెల్లడించారు.
మంచిర్యాలకు చెందిన ఓ ఐటీ లావాదేవీలు నిర్వహించే వ్యక్తి అత్యాశకు వెళ్లి రూ.4.50 లక్షలు సైబర్ నేరగాళ్లకు చెల్లించుకున్నారు.
1930 టోల్‌ఫ్రీ నెంబరు :
సైబర్ క్రైం పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసేలోపే నేరగాళ్లు డబ్బులను ఖాతాల నుంచి లాగేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. ఖాతాల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే వెంటనే హెల్ప్‌లైన్ నెంబరు 1930కి ఫోన్ చేయాలి.

పోలీసులు ఇచ్చే సూచనలివే :
- చిన్నారులు వినియోగించే మొబైల్ ఫోన్లలో బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలు ఏవీ ఉంచొద్దు.
- ఫోన్లకు వచ్చిన ఓటీపీ, ఇతర బ్యాంకు ఖాతాల వివరాలను ఎట్టిపరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులకు చెప్పొద్దు.
- పబ్లిక్ వైఫైల ద్వారా లావాదేవీలు జరపకూడదు.
- ఏటీఎం కార్డులకు చెందిన పాస్‌వర్డ్‌లను ఫోన్లలో సేవ్ చేసుకోవద్దు.
- డెబిట్‌కార్డు, ఫోన్ హ్యాక్ అయిందన్న అనుమానం రాగానే వెంటనే ఇంటర్నెట్ ఆధారిత కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయాలి.
- అనుమానం వస్తే కాల్‌సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేస్తే క్రెడిట్ కార్డుపై లావాదేవీలు ఆగిపోతాయి.
మంచిర్యాల జిల్లాలో భారీగానే సైబర్ మోసాలు :
- ఈ సంవత్సరం నమోదైన సైబర్ కేసులు : 95 (సెప్టెంబరు వరకు)
- బాధితులు మోసపోయిన నగదు : రూ.95,49,413
- పోలీసులు తక్షణం వెనక్కి రాబట్టిన సొమ్ము : రూ. 20,29,556 (1930కి ఫిర్యాదు ద్వారా)
అమ్మాయి అని రిప్లై ఇవ్వగానే న్యూడ్ ఫొటోలు పెట్టాలని అడిగారు: అక్షయ్
'ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు? - మీ ఫోన్‌తోనే సంపాదించండి' : ఆశపడ్డారో అంతే సంగతులు!

