సన్న బియ్యాన్నీ అమ్మేసుకుంటున్నారు - సరిహద్దులు దాటించేస్తున్నారు
సన్నబియ్యం అక్రమ రవాణా - అంతర్రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు - ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఆగని దందా

Published : September 14, 2025 at 9:36 AM IST
Fine Rice Smuggling in Telangana : పదేళ్ల వరకు రేషన్ షాపుల్లో పేదల కడుపు నింపడానికి దొడ్డు బియ్యాన్ని ఇచ్చేవారు. వాటిని వారు తినలేక ఎన్నో అవస్థలు పడేవారు. ఎవరైనా కొంటాను అంటే వారికి విక్రయించేవారు. కానీ ఆ తర్వాత మారిన ప్రభుత్వంతో ఈ ఏడాది ఉగాది నుంచి ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా సన్న బియ్యాన్ని ఇస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ రేషన్‌షాపుల్లో బియ్యం తీసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని ఇంటి అవసరాలకు వినియోగించకుండా అమ్మితే రేషన్‌కార్డు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. అయినా కొందరు వాటిని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మొదట్లో వీటి విక్రయాలు కాస్త తగ్గగా, గత నెల రోజులుగా దందా మళ్లీ మొదలైంది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల అక్రమంగా తరలిస్తున్న సన్నబియ్యం పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.
నిఘా పెంచితేనే అడ్డుకట్ట : గతంలో దొడ్డుబియ్యం రవాణాను అడ్డుకునేందుకు అటు పోలీసులు, ఇటు పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంటు బృందాలు, విజిలెన్స్ వేర్వేరుగా తనిఖీలు చేపట్టేవి. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తుండటంతో వీటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందనే ఉద్దేశంతో ఈ బృందాలు రిలాక్స్ అయ్యాయి. తిరిగి అక్రమ దందా జోరందుకుంటున్న నేపథ్యంలో సంబంధిత విభాగాలు నిఘా పెంచాలి. అలాగే తనిఖీలు చేపడితేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

పల్లెలు, పట్టణాల్లో సన్నబియ్యం సేకరణ :
- గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు కిలోకు రూ.10 నుంచి రూ.15 చొప్పున లబ్ధిదారులు వ్యాపారులకు విక్రయించేవారు. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు అమ్ముతున్నారు.
- ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ప్రతి నెలా వస్తున్న కోటాలో దాదాపు 10-20 శాతానికి పైగా పక్కదారి పట్టేలా వ్యాపారులు చూస్తున్నారు. ఇలా తమ దందాను సిద్ధం చేసుకున్నారు.
- పల్లెలు, పట్టణాల నుంచి సేకరించిన సరకును కొందరు ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తున్నారు. అలాగా గుజరాత్, మహారాష్ట్రకు తరలించేస్తున్నారు.
కొన్నిచోట్ల దుకాణాల వద్దే విక్రయాలు : సిద్దిపేట, దుబ్బాక, మిరుదొడ్డి దళారులు ఇంటింటికీ వెళ్లి సన్నబియ్యం సేకరిస్తున్నారు. రేషన్‌కార్డుదారులు కొందరు సన్నబియ్యం నాణ్యంగా లేవనే ఉద్దేశంతో రేషన్ దుకాణాల వద్దే విక్రయించేస్తున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, కంది, ఇంద్రేశం, మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
- శంకర్పల్లి, పటాన్చెరు ప్రాంతాల్లో సేకరించిన 311 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుజరాత్‌కు లారీలో తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మాడ్గి చౌరస్తా వద్ద పోలీసులు ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- కుల్కచర్లలో ఓ వ్యక్తి 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆటోలో తలిస్తుండగా పోలీసులు వాటిని పట్టుకున్నారు. దౌల్తాబాద్ మండలం గోకపస్లాబాద్లో ఆటోలో తరలిస్తున్న పది క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు.
- ఆ మధ్య దొడ్డు బియ్యం కూడా ఇలానే పక్కదారి పట్టడంతో విజిలెన్స్ అధికారులు వరుస దాడులతో ఎక్కడికక్కడ అక్రమ బియ్యం ముఠాలను అడ్డుకున్నారు.
రేషన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్ - సన్న బియ్యం తీసుకోకుంటే ఏమవుతుందో తెలుసా?

