How To Save Electricity Bill : ఎండలు మండిపోతుండటంతో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఇంట్లో ఫ్యాన్‌లు, ఏసీ, కూలర్లు గంటల తరబడి వినియోగిస్తుండటం వల్ల మీటర్ గిర్రున తిరుగుతోంది. నెలాఖరులో వచ్చే బిల్లు చూసి గొల్లుమనడం సామాన్యుడి వంతవుతోంది. నగరంలో ఫిబ్రవరిలో సగటు విద్యుత్ డిమాండ్ 2,715 మెగావాట్లు, మార్చిలో అది 3,714కు పెరిగింది. మేలో ఐదువేలకు చేరుకోనుందని అధికారుల అంచనా. వినియోగంలో జాగ్రత్తలు, పొదుపుమంత్రాన్ని పాటించకపోతే జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ : వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఉండే కుమార్ ఎండ తీవ్రత పెరుగుతుండటంతో వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీని కొనుగోలు చేశాడు. రోజుకు 8గంటల చొప్పున నెల రోజుల పాటు వినియోగించారు. మార్చి నెలలో అతడికి రూ.2,880 కరెంట్ బిల్లు వచ్చింది. ఒక్కసారిగా అంత బిల్లు రావడంతో తీవ్ర ఆందోళన చెందిన అతడు మే నెలాఖరు వరకు ఎలా నెట్టుకు రావాలనే అయోమయంలో పడ్డాడు.
ఇవి పాటిస్తే మేలు :
- గది ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే ఎలక్ట్రిక్ ఉపకరణాలైన టీవీ, రిఫ్రిజిరేటర్, ఓవెన్ లాంటివి వాడకూడదు.
- సరైన నిర్వాహణ లేకపోవడంతో ఏసీల్లో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
- ఎల్‌ఈడీ బల్బుల వినియోగం, ఇన్వర్టర్ ఏసీలు, రూంలోకి రాగానే గుర్తించి వెలిగేలా సెన్సర్లు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
- ఏసీని ఉపయోగించేటప్పుడు రూం టెంపరేచర్‌ను లెక్క చేయకుండా 16 నుంచి 18 డిగ్రీలు పెట్టడం వల్ల లోడ్ అనేది పెరిగి ఎక్కువగా విద్యుత్ ఖర్చవుతోంది. అందుకు 24 డిగ్రీల ఉష్ణోగ్రత గదిలో ఉండే విధంగా చూసుకోవాలి. గది చల్లబడేంత వరకు ఫ్యాన్ వేస్తే గది వేగంగా చల్లబడి ఏసీపై భారం తగ్గుతుంది.
వినియోగం తగ్గించే పరికరాలు : విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు పలు రకాల ప్రొడక్టులు మార్కెట్‌లోకి వచ్చాయి. ‘పవర్ సేవర్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాకెట్‌లో వీటిని అమర్చగానే విద్యుత్‌లోడ్ హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరిస్తున్నాయి.
స్మార్ట్ ప్లగ్ - రాత్రి ఏసీ ఆన్ చేస్తే ఉదయం వరకు అలా నడుస్తూనే ఉంటుంది. గది చల్లబడినప్పటికీ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. నియంత్రించేందుకు మార్కెట్‌లోకి ‘స్మార్ట్‌ప్లగ్’అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. ఏసీ, మెయిన్ సాకేట్‌కి కనెక్ట్ చేయడంతోపాటు యాప్‌తో సెల్‌ఫోన్‌కు అనుసంధానించొచ్చు. యాప్‌లోని ‘షెడ్యూల్ ఆన్-ఆఫ్’ ఫీచర్‌తో రోజువారీ విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గిస్తుంది.
మండే ఎండలతో పెరిగిన విద్యుత్ వినియోగం - తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
గ్యాప్ లేకుండా ఫ్యాన్, ఏసీలు వాడుతున్నారా? - గీత దాటితే గృహజ్యోతి మిస్సవుతారు!