Ganesh Statue in Khairatabad : రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా అందరి కళ్లు ఖైరతాబాద్ గణేషుడి పైనే ఉంటాయి. ఈసారి ఎంత ఎత్తులో, ఏ రూపంలో దర్శనమిస్తాడోనని భక్తులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఆ ఎదురు చూపులకు గణేశ్ ఉత్సవ కమిటీ ఈసారి తొందరగానే తెరదించింది. ఈ ఏడాది వినాయక చవితికి విఘ్నేశ్వరుడు 69 అడుగుల ఎత్తున శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరనున్నాడు. ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే చవితి వేడుకల్లో ప్రతిష్ఠించే గణేశ్ విగ్రహ నమూనా చిత్రాన్ని శుక్రవారం ముఖ్య అతిథులు విడుదల చేశారు. ఏకాదశి రోజు చేసే కర్రపూజ నాడే విగ్రహ నమూనా విడుదల చేయడం ఇదే తొలిసారి. ప్రతి ఏటా విగ్రహాన్ని మట్టితోనే తయారు చేయడం అనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
విగ్రహం విశిష్ఠతలు :
- ఈసారి విగ్రహం మూడు తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది.
- తలపై పడగవిప్పిన ఐదు సర్పాలు ఉంటాయి.
- మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి.
- చేతుల్లో కుడివైపు పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, రుద్రాక్షమాల, అభయహస్తం చూపుతూ ఉంటాయి.
- ఎడమవైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డూ ఉంటాయి.
- విగ్రహం దిగువన కుడివైపు పూరీ జగన్నాథ స్వామి ఉంటారు.
- ఎడమవైపు శ్రీ లలితా త్రిపురసుందరి విగ్రహాలు ఉంటాయి.
- వినాయకుడి మండపానికి కుడివైపున ఉన్న మండపంలో దాదాపు 25 అడుగుల ఎత్తులో శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని ఉంచనున్నారు.
- ఎడమవైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువు దీరుతారు.