Collapsed Sitarama Project Pillar : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కోట్ల నిధులతో చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన సూపర్ పాసేజు పిల్లర్ కూలిపోయింది. దీంతో కాల్వకు ఏర్పాటు చేసిన సైడ్ రివిట్మెంట్ దెబ్బతింది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించిన 10 రోజులు గడుస్తున్నా బయటికి రానీకుండా మరమ్మతులు చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో పశువుల కాపరులను ఆ మార్గం గుండా వెళ్లకుండా అడ్డుకోవడంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. సుమారు ఈ పిల్లర్ విలువ రూ.5 లక్షలని, ఇన్ని లక్షలు ఖర్చు చేసిన పిల్లర్ కుంగిపోవడంతో నాణ్యత ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పది రోజులు ముందు గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టేందుకు అప్రోచ్ రోడ్డు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాలువలో నీరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ కాలువలో నీరు ప్రవహిస్తే మొత్తం కూలిపోయే అవకాశం ఉంది. అలాగే కాలువ కోతకు గురయ్యేది. గత ఏడాది పంప్ హౌస్ 1 నుంచి 2కు వచ్చే కాలువ కొత్తూరు శివారులో కోతకు సైతం గురయ్యేది. ఇలాంటి తరుణంలో అధికారులు అప్రమత్తమై పనులు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
పిల్లర్ నిర్మించేందుకు గుత్తేదారుకు మళ్లీ బాధ్యత : కాల్వలో పడిపోయిన పిల్లర్‌ను తిరిగి నిర్మించేందుకు గుత్తేదారుకు బాధ్యత అప్పగించినట్లు, ఇందుకు సుమారు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని ఓ అధికారి తెలిపారు. ఈ పిల్లర్ మళ్లీ నిర్మించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. స్థానికులు మాత్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా అధికారుల తీరు ఉందని మండిపడుతున్నారు.
పనులు జరిగే సమయంలోనే పర్యవేక్షణ చేసి, నిబంధనల ప్రకారం పనులు జరిపించి ఉంటే ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుడి ఇష్టారాజ్యంగా పనులు చేయటం కారణంగానే ఈ పిల్లర్ కూలిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి ప్రాజెక్టు సూపర్ ప్రాసెస్ పిల్లర్ కుంగటంపై ఉన్నతాధికారులతో విచారణ చేసి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మేడిగడ్డ బ్యారేజీపై షాకింగ్ న్యూస్ - ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి?
'సీతారామ'లో మరో ముందడుగు! - రూ.4 వేల కోట్ల పనులకు రేపోమాపో టెండర్లు!! - Sita rama lift project