SITA RAMA KALYANAM AT VONTIMITTA: ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండటం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని అంటారు.
ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జగదభిరాముడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రంగమండపంలో సీతారామ లక్ష్మణులను టీటీడీ వేదపండితులు అలంకరించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుంచి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ఠ, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 6న (ఆదివారం) ధ్వజారోహణంతో కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనసేవ జరగనున్నాయి.
పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం దంపతులు: టీటీడీ వారు ఇప్పటికే ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేసి, భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. ఈనెల 11వ తేదీన రాములోరి కల్యాణం జరగనుండగా, ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులు భారీగా వస్తారనే అంచనాతో తీర్థ ప్రసాదాలను సిద్ధం చేశారు. కల్యాణాన్ని వీక్షించేందుకు విచ్చేసే అశేష జనవాహినికి తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. శనివారం అంకురార్పణ, ఆదివారం ధ్వజారోహణం, 10వ తేదీన గరుడసేవ, 11వ తేదీన కల్యాణం జరగనుంది.
సీతారాముల కల్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట-పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం దంపతులు