SIT Searches Raj Kasireddy Houses and Offices in Liquor Scam : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాజ్ కసిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న గచ్చిబౌలిలోని అరేట ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించింది. మరోవైపు లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు హాజరుకాకుండా రాజ్ కసిరెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఆయనకు మళ్లీ నోటీసులు జారీచేశారు ఈ నేపథ్యంలోనే సిట్ అధికారుల బృందం హైదరాబాద్‌లో మొత్తం 15 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో మొత్తం 50 మంది వరకూ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కసిరెడ్డి ఇళ్లతో పాటు అతని బంధువుల సంస్థలు, గృహాలపై కూడా సిట్ అధికారులు దాడులు చేపట్టారు. అదేవిధంగా ఆయనకు చెందిన ఈడీ క్రియేషన్స్ అనే సంస్థలో కూడా సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి దేశంలోనే ఉన్నాడని సిట్ అధికారులు చెబుతున్నారు. అతనికి గతంలోనే ఎల్ఓసీ ఇచ్చామని పేర్కొంటున్నారు. కసిరెడ్డి తొందరలోనే బయటకు వస్తాడని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రాజ్ కసిరెడ్డి వేరే ఫోన్లు వాడుతున్నారని సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా కార్యాలయం : 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో కలసి పనిచేసిన రాజ్ కసిరెడ్డి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు 'జే బ్రాండ్ల మద్యం' సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమీషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెలా 60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు రూ.3000 కోట్ల వరకూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు రాజ్ కసిరెడ్డి చేర్చినట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. లంచాల నెట్‌వర్క్‌ను రూపొందించడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేరున్న ఓ నాయకుడితో కలసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా కార్యాలయమే ఏర్పాటు చేసి దందా నిర్వహించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో ఏ రోజు, ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో రాజ్ కసిరెడ్డే నిర్ణయించేవారని సమాచారం.
ఐటీ సలహాదారుగా పనిచేసిన తనకు ఎక్సైజ్ కేసుతో సంబంధమేంటి?: రాజ్ కసిరెడ్డి రివర్స్ జిత్తులు
ఎంపీ మిథున్‌రెడ్డికి బిగ్ షాక్ - ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు