SIT Notices to kasireddy Rajasekhar Reddy : వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులిచ్చింది. ఏప్రిల్ 19న విచారణకు హాజరుకావాలని అందులో తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డి పెట్టుబడులకు సంబంధించిన కీలక వివరాలను అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కసిరెడ్డి) కీలక పాత్రధారిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో దోచుకున్న నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టినట్లు దర్యాప్తులో తేలింది. చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఓ పాన్ ఇండియా మూవీని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 29న ఈ చిత్రాన్ని రీలిజ్ చేశారు. దీనికి కథ కూడా రాజ్ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్‌లో వేసుకున్నారు.
AP Liquor Scam Updates : అయితే ఆ మూవీని ఎంత బడ్జెట్‌లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? ఈ చిత్రానికి జరిగిన వ్యాపారమెంత? తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది. కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించింది.
అదేవిధంగా ఇంకా ఏయే చిత్రాల నిర్మాణానికి లైన్‌లో పెట్టారు? వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు?ఇందుకు మనీ రూటింగ్ ఎలా చేశారు? అనే దానిపై సిట్ దర్యాప్తులో పలు కీలక అంశాలు బయటికొచ్చాయి. డబ్బు రూటింగ్ చేసే క్రమంలో భాగంగా ఏయే స్థాయిల్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేదానిపైనా సిట్ వివరాలు సేకరించింది.
దోపిడీ సొమ్ముతో ‘స్పై’ - బ్లాక్‌మనీని వైట్‌లోకి మార్చుకునేందుకు సినిమాలు
లిక్కర్ స్కామ్ - రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు