SIPB Meeting: రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో క్షేత్రస్థాయిలో అవి కార్యరూపం దాల్చేలా చేయడం అంతకన్నా ముఖ్యమని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అనుకున్న సమయానికి ఆయా సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఆయా ప్రాజెక్ట్‌ల పురోగతిని ఎప్పుటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏ సంస్థ ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో పోర్టల్ రూపొందించాలని స్పష్టం చేశారు.
సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) వివిధ సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి మరో 31 వేల 617 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 32 వేల 633 మందికి ఉపాధి లభించనుందని సీఎం తెలిపారు. ఆహారశుద్ధి, ఐటీ, ఇందనం, ఐ అండ్ సీ రంగాల్లో 16 సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి. వాటి పెట్టుబడుల ప్రతిపాదనలను SIPB ఆమోదం తెలిపింది. విశాఖలో 1370 కోట్లతో TCS కేంద్రం ఏర్పాటు చేయనుండగా, 12 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 4 వేల 200 కోట్లతో ప్రీమియర్ ఎనర్జీ, 2063 కోట్లతో మహామాయ ఇండస్ట్రీస్ పెట్టుబడుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదముద్ర వేసింది.
ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో పోర్టల్: ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఉత్పత్తి మొదలుపెడితేనే లక్ష్యాన్ని చేరుకున్నట్లనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్ర స్ధాయిలో కనిపించాలనీ సూచనలు జారీ చేశారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో పోర్టల్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం కాగా, వాటిల్లో 57 సంస్థలకు సంబంధించి 4 కోట్ల 71 లక్షల 379 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడల ద్వారా మొత్తం 4 లక్షల 17 వేల 188 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కేవలం 5 సార్లు మాత్రమే SIPB సమావేశం, కాగా కూటమి ప్రభుత్వం ఏడాది తిరక్కుండానే ఐదుసార్లు భేటీ అయ్యింది.
ఐటీ సంస్థలకు నామమాత్రపు ధరలకే భూములు ఇవ్వాలని మంత్రి లోకేశ్ సీఎంను కోరారు. దీనివల్ల మరిన్ని సంస్థలు రాష్ట్రానికి తరలివచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం, లోకేశ్ సూచనల ఆధారంగా ఐటీ విధానాన్ని సవరించాలని అధికారులను ఆదేశించారు.
పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలి : సీఎం చంద్రబాబు