Singareni Collieries Company Workers Bonus : 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యి దాదాపు రెండున్నర నెలలు అవుతున్నా సింగరేణి యాజమాన్యం ఇంకా లాభాలను ప్రకటించలేదు. లాభాలను ఎప్పుడెప్పుడు వెల్లడిస్తారా? అని కార్మికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు సింగరేణిలో ఉత్పత్తి ఏడాదిగా పరిగణిస్తారు. లాభాలు, టర్నోవర్‌ను ఏప్రిల్ నుంచి మార్చి వరకు లెక్కించి అందులో కొంత శాతాన్ని కార్మికులకు ప్రకటిస్తుంది.
ఏటా ఐదారు నెలల తర్వాతే : సింగరేణి యాజమాన్యం లాభాలను వెల్లడించిన కొన్నిరోజుల వ్యవధిలోనే అందులోంచి కార్మికులకు చెల్లించాల్సిన వాటాను సీఎం నిర్ణయించటం ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. లాభాలు ప్రకటించిన తర్వాత వాటాను పొందేందుకు ఉద్యోగులకు మరో నెల రోజుల సమయం పడుతుంది. ఏటా ఐదారు నెలల తర్వాతే తమకు వాటా సొమ్ము జమవుతోందని కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా తమకు రావాల్సిన వాటాను త్వరగా చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వాటా ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం : ఈ ప్రక్రియలో ముందుగా లాభాలను సింగరేణి యాజమాన్యం వెల్లడిస్తుంది. సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థలో 51శాతం వాటా కలిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాభాల్లో వాటా శాతాన్ని కూడా నిర్ణయిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో లాభాల్లో వాటాను 32శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో లాభాల్లో ఒకశాతాన్ని పెంచి మొత్తంగా 33 శాతం వాటాను కార్మికోద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి వచ్చిన లాభాల్లో 35శాతం వాటాను చెల్లించాలని సింగరేణి కార్మికోద్యుగులు కోరుతున్నారు.
లాభాలను తేల్చే పనుల్లో : కనీసం 35 శాతానికి తగ్గకుండా లాభాల్లో వాటాను న్యాయంగా ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (గుర్తింపు సంఘం) అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్, ఐఎన్‌టీయూసీ (ప్రాతినిథ్య సంఘం) ప్రధాన కార్యదర్శి త్యాగరాజన్, బీఎంఎస్ నాయకులు మాధవనాయక్, పవన్‌కుమార్ తదితరులు కోరుతున్నారు. లాభాలను తేల్చే పనులు కొనసాగుతున్నాయని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ ఈటీవీ భారత్‌కు తెలిపారు.
సింగరేణిలో యువ గళం - టాప్ కార్పొరేట్ జాబ్స్ వదులుకొని మరీ!
ఇతర కంపెనీలతో చూస్తే సింగరేణి బొగ్గు ధర చాలా ఎక్కువగా ఉంది : సీఎండీ బలరామ్