అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చే సిమ్ బాక్స్ - హైదరాబాద్‌లో ముఠా సభ్యుల అరెస్ట్
మోసపూరిత ఫోన్ కాల్స్ ఫిర్యాదుల కోసం ‘చక్షు’ పేరుతో ప్రత్యేక పోర్టల్ - హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతం నుంచి మేసపూరిత కాల్స్ వస్తున్నట్లు గుర్తించిన అధికారులు - సిమ్‌బాక్స్‌తో పాటు 200 సిమ్‌కార్డులు స్వాధీనం

Published : September 12, 2025 at 2:36 PM IST
Simbox Fraud In Hyderabad : అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చే టెక్నాలజీ పేరు సిమ్ బాక్స్. వీటిని నడుపుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు బ్యూరో సంచాలకులు శిఖాగోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
'చక్షు' పేరుతో ప్రత్యేక పోర్టల్ : ప్రకటనలోని వివరాల ప్రకారం మోసపూరిత ఫోన్ కాల్స్‌కు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు టెలికాంశాఖ 'చక్షు' పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌కు ఇటీవల ఓ కంప్లెంట్ వచ్చింది. దానిలో ఒక అన్నోన్ నంబరు నుంచి ఫోన్ చేసి తమను మోసం చేశారని బాధితుడు ఈ పోర్టల్‌లో పేర్కోన్నారు. దీంతో టెలికాం అధికారులు ఈ సమాచారాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యారోకు పంపారు. దీని ఆధారంగా అక్కడి అధికారులు టెలికాంశాఖ (డాట్) సహకారంలో దర్యాప్తు మొదలుపెట్టారు.
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతం నుంచి ఈ కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో దాడి జరిపి సిమ్‌బాక్స్‌తో పాటు 200 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి హఫీజ్బాబానగుర్కు చెందిన హిదయుల్లా(28), ఆహద్ఖాన్(25), చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ షోయబ్ (24)లను అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోనికి వచ్చాయి.
నష్టపోయిన సొమ్ము రాబట్టుకునేందుకు : ఈ కేసులో ప్రధాన నిందితుడు హిదయుల్లా కార్ల వ్యాపారంలో నష్టపోయాడు. పబ్ వద్ద కలిసిన ఒక వ్యక్తికి జరిగిన విషయాన్ని చెప్పాడు. సదరు వ్యక్తి ఓ సలహా ఇచ్చాడు. దాని ప్రకారం ఒక ఆన్లైన్ గ్రూప్‌లో చేరి అక్కడ కూడా రూ.16 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. దాంతో అదే వ్యక్తి హిదయుల్లాకు వాట్సప్ ద్వారా హాంకాంగ్‌కు చెందిన వెనీసా అనే మహిళను పరిచయం చేశాడు.
ఈ క్రమంలో ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపార ప్రచారం కోసం సిమ్‌బాక్స్ ఏర్పాటు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిదయుల్లాకు కొరియర్ ద్వారా సిమ్‌బాక్స్ అందింది. అంతర్జాతీయంగా వచ్చే 'వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్' కాల్స్‌ను ఈ సిమ్‌బాక్స్ లోకల్ కాల్స్‌గా మారుస్తుంది. దీనికి భారీగా స్థానిక సిమ్‌కార్డులు అవసరం ఉంటుంది.
నిర్మాణ కార్మికులకు ధ్రువపత్రాలతో : ఇందుకోసం హిదయుల్లా సిమ్‌కార్డుల వ్యాపారి అహద్ఖాన్ను, ఆయన ద్వారా షోయబ్‌ను సంప్రదించాడు. వీరంతా కలిసి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు సిమ్‌కార్డులు అమ్మి, వారి ధ్రువపత్రాలతో 500 సిమ్‌కార్డులు సేకరించారు. వీటిని సిమ్బాక్స్లో పెట్టివీవోఐపీ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చడం మొదలుపెట్టారు.
నిందితులు అరెస్ట్ : ఈ నేరం కారణంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో సంబంధం ఉన్నవారితో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో సైబర్‌సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, సూర్యప్రకాశ్, సీఐలు రమేశ్, శ్రీనునాయక్, డి.శ్రీను, ఎస్సైలు రాము నాయక్‌లతో పాటు డాట్ ఏడీజీ (సెక్యూరిటీ) అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ అరెస్ట్ లేనే లేదు - అయినా ఎందుకు స్కామర్లకు చిక్కుతున్నారు?
ఆ నంబర్స్ నుంచి కాల్ వస్తే తప్పకుండా కేటుగాళ్లే - 'రిక్విన్'తో సైబర్ నేరాలకు చెక్!

