GARBAGE FERTILIZER : రోడ్లపై, వీధుల్లో చెత్త కనబడితే అక్కడ చర్యలు తప్పవు. సేకరించిన చెత్తను వృథాగా తగులబెట్టకుండా మూడు రకాలుగా విభజిస్తారు. ప్రాసెస్ చేసి, సేంద్రీయ ఎరువుగా తయారు చేసి కేజీ రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. పరిశుభ్రత, ఆదాయా అర్జనలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
ఎక్కడి చెత్త అక్కడే పునర్వినియోగం : స్మార్ట్ సిటీగా పేరుపొందడమే లక్ష్యంగా సిద్దిపేట మున్సిపాలిటీ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఎక్కడికక్కడే చెత్తను శుద్ధి చేసేందుకు సంకల్పించింది. వార్డుల్లో తడి చెత్తను సేకరించి, దూరంలో ఉన్న కంపోస్టు యార్డులకు తీసుకువెళ్లడం పారిశుద్ధ్య విభాగానికి పెద్ద సవాల్‌గా మారుతోంది. కనుక ఎక్కడి చెత్తను అక్కడే రీసైకిల్ చేసేలా వీరు చర్యలు చేపడుతున్నారు. హౌసింగ్ బోర్డ్, ఎర్ర చెరువు, మైత్రివనం, కోమటి చెరువు, నెహ్రూ పార్కు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సాపూర్ చెరువు వద్ద కంపోస్టు యార్డుల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికను అందించారు.
"సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లలో ఇప్పటివరకు సుమారు 2 లక్షల 30 వేల కిలోల సేంద్రీయ ఎరువును విక్రయించాము. వర్మీ కంపోస్టు ఎరువు కిలో రూ.10, సెమీ వర్మీ కంపోస్టు రూ.3 నుంచి రూ.4 వరకు అమ్ముతున్నాము. చెత్తతో ఎరువు తయారు చేసే విధానాలపై రైతులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాము." - దీప్తి ,మున్సిపల్ కౌన్సిలర్
మున్సిపాలిటీకి ఆదాయం : మున్సిపాలిటీలో చెత్త సేకరించిన తర్వాత, కంపోస్ట్ ఎరువుగా మార్చడానికి 90 రోజుల సమయం పడుతుంది. ఎరువును విక్రయించడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల రైతులకు కూడా లాభం చేకూరుతుందన్నారు. సిద్దిపేట మాదిరిగా అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా చెత్త నుంచి సేంద్రీయ ఎరువును తయారు చేయగలిగితే పట్టణాలు, గ్రామాలు శుభ్రంగా మారి, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు.