Drinking Water Shortage in Towns And Municipalities: రాష్ట్రవ్యాప్తంగా 39 పట్టణాల్లో తాగునీటికి ఇబ్బంది ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆరు చోట్ల ప్రస్తుతం 3 రోజులకోసారి నీరు అందిస్తున్నారు. ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులను అధిగమించాలంటే రూ.39.50 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పురపాలకశాఖ పంపించింది.
39 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి: ఎండలు మండుతున్నాయి. ఈ వేసవిలో 39 పుర, నగరపాలక సంస్థల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం సర్కిల్‌లో అత్యధికంగా ఏడు చోట్ల సమస్య ఉంటుందని గుర్తించారు. బోర్లు, పాడైన పైపులైన్ల రిపేర్లు, అద్దెకు ట్యాంకర్ల సరఫరా, ఇతరత్రా పనులకు రూ.39.50 కోట్ల అవసరమవుతుందని ప్రభుత్వానికి పురపాలకశాఖ నివేదించింది. పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
ప్రస్తుతం ఎన్ని చోట్ల రోజూ నీరు సరఫరా చేస్తున్నారు, వచ్చే రెండు, మూడు నెలల్లో ఎన్ని చోట్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంటుందో నివేదికలో పేర్కొన్నారు. 27 పుర, నగరపాలక సంస్థల్లో ప్రస్తుతం రోజూ రెండు సార్లు నీరు సరఫరా చేస్తున్నారు. 53 చోట్ల రోజుకోసారి, మరో 37 చోట్ల రెండు రోజులకోసారి నీరు అందిస్తున్నట్లు పురపాలకశాఖ తెలిపింది. ఒంగోలు, మార్కాపురం, పొదిలి, పలమనేరు, బద్వేల్, గుత్తిలో నీటి లభ్యత తగ్గి ప్రస్తుతం మూడు రోజులకోసారి నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. వీటిలో ట్యాంకర్లతో నీటి సరఫరా అనివార్యమని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ట్యాంకర్లు తిప్పుతున్నట్లు వివరించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు: వేసవిలో ఈదురు గాలులు, ఇతరత్రా కారణాలతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే నీటి పంపింగ్‌కి ఇబ్బంది లేకుండా హెడ్ వాటర్ వర్క్స్‌లో జనరేటర్లు అద్దెకు తీసుకుని వినియోగించేలా కమిషనర్లకు ఆదేశాలిచ్చినట్లు పురపాలకశాఖ పేర్కొంది. విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా డిస్కంల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. తాగునీటి సరఫరాను రోజూ కమిషనర్లు సమీక్షించడం, ఇందుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రభుత్వానికి తెలిపింది. నీటిలో నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించేలా చూడాలని కమిషనర్లకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది.