AP Shining Stars Awards 2025 : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డు-2025 పేరుతో అవార్డుల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యార్థులను సత్కరించారు. వారికి ధ్రువపత్రం, పురస్కారంతో పాటు రూ.20,000ల నగదును అందజేశారు.
షైనింగ్ స్టార్స్-2025 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పార్వతీపురం మన్యం జిల్లా వేదికగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పది, ఇంటర్‌లో ప్రతిభ చూపిన 178 మంది విద్యార్థులకు రూ.20,000ల నగదు చొప్పున ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసాపత్రాన్ని ఆయన అందజేశారు. ఈ ఫలితాల సాధనకు వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.
Lokesh on Shining Stars Awards : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టామని లోకేశ్ గుర్తు చేశారు. ఇది సంస్కరణల్లో తొలి అడుగు మాత్రమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవచేయాలని సూచించారు. పేదరికం నుంచి బయటపడటానికి చదువే ఏకైక మార్గమని తెలిపారు. జీవితంలో ఏం కోల్పోయినా చదువును ఎవరూ దూరం చేయలేరని లోకేశ్ పేర్కొన్నారు.
మిమ్మల్ని చూసి తాము గర్వపడుతున్నట్లు లోకేశ్ చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. పిల్లలకు మంచి భవిష్యత్ కల్పించాలనే సీఎం చంద్రబాబు ఆలోచనకనుగుణంగా పనిచేస్తున్నట్లు వివరించారు. అవకాశాలను నిచ్చెనమెట్లుగా ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణితో పాటు తదితరులు పాల్గొన్నారు.
AP Students Awards 2025 : తూర్పుగోదావరి జిల్లాలో పదో తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన 172 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పురస్కారం మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ప్రదానం చేశారు. రాజమహేంద్రవరంలోని త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమాత్యులు పాల్గొని వారిని సత్కరించారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకొని విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పని చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనకాపల్లి జిల్లాలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చూపిన 185 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్, ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డును బహుకరించారు. బాలాజీ చెరువు టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని 171 మంది విద్యార్థులకు రూ.20,000ల నగదు చొప్పున ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసాపత్రాన్ని ఆయన అందజేశారు. ఏలూరు శివారు వట్లూరులోని సర్ సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని 163 మంది విద్యార్థులను సత్కరించారు.
AP Shining Stars Awards : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ -2025 కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్, నగదు బహుమతులను ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్రావు, యార్లగడ్డ వెంకట్రావులతో కలసి మంత్రి అందజేశారు.
చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరింత ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. అనంతపురంలో పది, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆమె షైనింగ్ స్టార్స్ ప్రోత్సహకాలను అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవానికి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, జిల్లా కలెక్టర్ చేతన్ ముఖ్య అతిథులుగా పాల్గొని 225 మంది విద్యార్థులను సత్కరించారు.