An irreparable blow to the Maoists : వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతాబలగాలు కీలక విజయం సాధించాయి. నాలుగున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో తొలిసారి కేంద్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నంబాల కేశవరావును హతమార్చాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా 2024-25లోనే మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కాకులు దూరని కారడవులను సైతం చీల్చుకుంటూ నక్సల్స్‌కు కంచుకోటలుగా ఉన్న దండకారణ్యంలోని ప్రాంతాలను ఒక్కొక్కటిగా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే 330 మంది మావోయిస్టులు మృతిచెందగా ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.
ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా : దశాబ్దాల పాటు ఎత్తుకు పైఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య దండకారణ్యంలో సాగుతున్న పోరు ఒక ఎత్తైతే నక్సల్ మిషన్ 2026 మరో ఎత్తుగా నిలిచింది. వామపక్ష తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన భద్రతా బలగాలు నక్సల్స్ ఇలాకా అబూజ్ మడ్‌లోనూ గతేడాది కాలుమోపాయి. 2024లో దండకారణ్యంలో మావోయిస్టుల సంచారంపై ఉక్కుపాదం మోపేలా భద్రతా బలగాలు ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తూ వచ్చాయి. మావోయిస్టులకు ప్రధాన స్థావరాలుగా ఉన్న బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, అబూజ్‌మడ్ ప్రాంతాల్లో ముమ్మర కూంబింగ్‌లతో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశారు.
మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్న దండకారణ్యంలోని ప్రాంతాల్లోనూ పాగా వేసుకుంటూ ఆపరేషన్‌ను కొనసాగించారు. ఇక మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను జల్లెడ పట్టేందుకు ఏకంగా 24 వేల మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపి ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 20 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో 20 మంది మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.
"అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం మొత్తం 27మంది మావోయిస్టుల శవాలను కనుగొన్నాం. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ అలియాస్ బీఆర్ దాదా అలియాస్ గంగన్న మృతదేహాన్ని కూడా భద్రతా బలగాలు గుర్తించాయి." - సుందరరాజన్, బస్తర్ ఐజీ
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా : 2024 జనవరి నుంచి మొదలుపెట్టిన నక్సల్ మిషన్ 2026ను భద్రతా బలగాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీపీ హెచ్.జె.దొర అన్నారు. డ్రోన్ల వినియోగం, హెలికాఫ్టర్ల వినియోగంతో కీకారణ్యంలోనూ మావోయిస్టుల జాడ తెలుసుకుని విరుచుకుపడ్డాయని వివరించారు. దండకారణ్యంలో ఏడాదికి పైగా హోరాహోరీగా సాగిన పోరులో భద్రతా బలగాలే పైచేయి సాధించాయని హెచ్.జె.దొర అన్నారు.
2024లో జరిగిన ఎన్ కౌంటర్లలో 215 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2025 జనవరి నుంచి మే 21 వరకు 115 మంది హతమయ్యారు. మొత్తంగా మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక్క ఏడాదిన్నరకాలంలో 330 మావోయిస్టులు మృతిచెందడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
మావోయిస్టులు లేకపోవడం వల్లే తెలంగాణలో అభివృద్ధి: మాజీ డీజీపీ హెచ్జేదొర