AP Ration Cards Updates 2025 : కొత్త రేషన్ కార్డుల కోసం అర్జీకి కూటమి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. కానీ సర్వర్ సమస్య పరీక్ష పెడుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రామాణికంగా కొత్త కార్డులకు అర్జీలు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆధార్ నంబర్‌తో వాలంటీర్లు మ్యాపింగ్ ప్రక్రియ చేసేవారు. అందులో తప్పులు దొర్లుతుండడంతో ప్రస్తుతం కొత్త జంటలు అర్జీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఒకవైపు పౌరసరఫరాలశాఖ వెబ్‌సైట్ అందుబాటులోకి రాలేదు. మరోవైపు సచివాలయ సిబ్బంది తమ పరిధి కాదని చెబుతుండడంతో కార్డు రాదేమోనని అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంవత్సరాల తరబడి కొత్త కార్డులివ్వలేదు. దీంతో కార్డు కావాల్సినవారు, తప్పులు సవరణ కోరుకుంటున్నవారు, చిరునామా మార్పు, ఆధార్ సంఖ్య సవరణకు చాలామంది సచివాలయాలకు తరలివస్తున్నారు.
ఇవీ ఇబ్బందులు :
- రేషన్ కార్డులో ఆధార్ తప్పుగా మ్యాపింగ్ అయితే సరిచేసేందుకు ఆప్షన్ ఇవ్వలేదు.
- మార్పులు చేర్పులకు సంబంధించి 15 ఏళ్ల ల్లోపు పిల్లలకు మాత్రమే అవకాశమిచ్చారు. 15 సంవత్సరాలకు మించిన పిల్లలను కూడా చేర్చేందుకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.
- ఆదాయపు పన్ను చెల్లించడం లేదని సంబంధిత శాఖ నుంచి పత్రాలను తీసుకొచ్చినా అర్జీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు.
- వివాహమై ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారిని కార్డులోంచి తొలగించేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. కేవలం మరణించవారి పేర్లు తొలగించేందుకే అవకాశం కల్పించినా సభ్యుల ఈకేవైసీని సిస్టం తీసుకోవడం లేదు.
- సింగిల్ కార్డుకు 40 నుంచి 50 సంవత్సరాల వయసున్నవారికే అవకాశమిచ్చారు. 50 ఏళ్లకు పైబడినవారు అర్జీ చేయడానికి వీల్లేకుండాపోయింది.
- రేషన్ కార్డులో తప్పుగా నమోదైన కుటుంబ సభ్యుల సంబంధాలను సరి చేసుకోవాలన్నా కార్డులోంచి తొలగించాలన్నా ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇవ్వలేదు.
చర్యలు తీసుకుంటున్నాం : సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని గుంటూరు జిల్లా పౌరసరఫరాల శాఖ ఇంఛార్జ్ అధికారి ఆర్. చంద్రముని తెలిపారు. వివిధ సమస్యలపై సమాచారం మండలాల అధికారుల నుంచి తెలుసుకున్నామని చెప్పారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే అవన్నీ తొలగిపోతాయన్నారు. రేషన్ కార్డు దరఖాస్తుతోపాటు, మార్పులు/చేర్పులు, తప్పుల సవరణ తదితర అంశాలకు సంబంధించి అన్ని సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చేలా చూస్తామని ఆర్.చంద్రముని వెల్లడించారు.
వాట్సప్‌లోనూ అదే సమస్య: రేషన్ కార్డుల్లో అవసరమైన మార్పులు, చేర్పులను ఈ నెల 15 నుంచి వాట్సప్ గవర్నరెన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కానీ బుధవారం రాత్రి వరకు అన్ని సేవలు అందుబాటులోకి రాలేదు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి చేసుకుందామన్నా సర్వర్ సమస్య వేధిస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
వాటిని క్లిక్ చేస్తే కమింగ్ సూన్ : వాట్సప్ గవర్నెన్స్ నంబరు 95523 00009 నంబరుకు ‘బీఖి’ అని పెడితే.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు కనిపిస్తాయి. వాటిలో కావాల్సిన శాఖను ఎంపిక చేసుకుని దరఖాస్తు సమర్పించవచ్చు. సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారు. ‘సివిల్ సప్లై సర్వీసెస్’లో 5 రకాల సేవలు కనిపిస్తున్నాయి. దీపం స్టేటస్, రేషన్ దుకాణాల్లో తీసుకున్న బియ్యం వివరాలు (రైస్ డ్రాన్ స్టేటస్), రైస్ ఈ-కేవైసీ స్టేటస్ మాత్రమే పనిచేస్తున్నాయి. రైస్ కార్డు సరెండర్, కరెక్షన్ ఆప్ రాంగ్ ఆథార్ సీడింగ్ కనిపిస్తున్నా అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. వాటిని క్లిక్ చేస్తే కమింగ్ సూన్ అని వస్తోంది.
ప్రజలు ప్రధానంగా కోరుకునేది రైస్‌కార్డులో తప్పు ఒప్పులు సరిచేయడం, యాడింగ్, డిలీట్ వంటివే. అవి అందుబాటులోకి రాకపోవటడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేషన్‌కార్డుల మార్పులు, చేర్పుల ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. జూన్ 1 నుంచి కొత్త కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. త్వరితగతిన పూర్తి కావాలంటే వాట్సప్ సేవలు అందుబాటులోకి వస్తే మేలని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా? - అయితే ఈ సేవల గురించి తెలుసుకోండి
రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా? - అయితే ఈ సర్టిఫికెట్ తప్పనిసరి