Vizianagaram Terror Plot Case : తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సన్నాహక బాంబు పేలుళ్లు జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. వారం క్రితం సిరాజ్‌తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు వారి నుంచి కీలక వివరాలు రాబట్టారు. పోలీసులు సరైన సమయంలో అదుపులోకి తీసుకోకుంటే ఊహించనంత నష్టం వాటిల్లేదని గుర్తించారు.
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. గజ్వా-ఈ-హింద్ పేరిట భారత్‌పై యుద్ధమే లక్ష్యంగా అల్-హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ -అహిం సంస్థను సిరాజ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలను నియమించినట్లు దర్యాప్తులో బయటపడింది. మత ఛాందసవాదం, తీవ్రవాద భావజాలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు తేలింది. అహింను మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, దిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు చేసినట్లు వెల్లడైంది.
Vizianagaram Terror Case Updates : అహిం సంస్థను విస్తరించాలన్నా దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్నా భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించినట్లు తేలింది. విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్‌పై విద్వేషాన్ని రగిల్చే పలువురు మతోన్మాదులను సిగ్నల్, టెలిగ్రాం వంటి ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా సంప్రదించినట్లు గుర్తించారు. పాకిస్థాన్‌లో నివసిస్తున్న బిహార్ వాసి అబూత్‌హలేం ఎలియాస్ అబూ మసూబ్‌తో పాటు అఫ్గానిస్థాన్‌లో ఉంటున్న పాకిస్థాన్ వాసి మసూబ్ అలీఖాన్ షేక్‌లు అతడికి పరిచయమైనట్లు తేలింది.
తాము చెప్పినట్లు చేస్తే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్‌కు వారు భరోసా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అవసరమైతే ఇప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాల్ని అందిస్తామని చెప్పారని సమాచారం. తొలుత కొన్నిచోట్ల ట్రయల్ బ్లాస్ట్‌లు చేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారని తేలింది. బాంబులు ఎలా తయారు చేయాలి? పేలుళ్లు ఎలా జరపాలి? అనే అంశాలపై డాక్యుమెంట్లను పంపించారని వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్ట్‌ల నిర్వహణకు అవసరమైన సామగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నాడని విచారణలో నిర్ధారించారు.
ఈ తరుణంలోనే సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు? వంటి అంశాలపై నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంపేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. సరైన సమయంలో విజయనగరం పోలీసుల సహకారంతో సిరాజ్‌ను అరెస్ట్ చేసిందని ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించారు. పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిశాలోని బ్రహ్మపుర మొదలుకుని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్‌లోనూ సిరాజ్ అన్వేషించినట్లు దర్యాప్తులో తేలింది.
అనువైన ప్రాంతాల పరిశీలన : కొన్నాళ్ల కిందట బ్రహ్మపురలో ఓ వివాహ వేడుకకు హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించినట్లు వెల్లడైంది. పేలుడు పదార్థాలను తొలుత అటవీ ప్రాంతాల్లో పరీక్షించి, ఆ తర్వాత జనసమ్మర్ధ ప్రదేశాల్లో అమర్చాలని భావించినట్లు తేలింది.
బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఐఈడీ -ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ల తయారీపై దృష్టి సారించాడని దర్యాప్తులో తెలిసింది. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్‌తో కలిసి ఐఈడీల తయారీకి అతడు సన్నాహాలు చేసినట్లు గుర్తించారు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణనష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్‌ను పేలుడు పదార్థాల్లో వాడాలనుకున్నట్లు తెలిసింది. పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్లు నిర్ధారించారు.
Siraj and Sameer Investigation : బీటెక్ చదివేటప్పుడు తన మతానికి చెందిన అమ్మాయిని సిరాజ్ ప్రేమించాడని ఆమె అతడిని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించినట్లు తేలింది. ముస్లిం యువతులను హిందూ యువకులు ప్రేమ పేరిట ఉచ్చులోకి దించుతున్నారని ఇది భగ్వా లవ్ ట్రాప్ అని, దానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అతడు పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించారు.
క్రమంగా సిరాజ్ అహిం సంస్థ పేరిట ఈ కార్యకలాపాలను నడిపించాడని ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని ఓ మదర్సాకు తరచూ వెళ్తుండేవాడని తెలిసింది. ఆ సమయంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మౌలానా ఫజియాఖాన్ అనే వ్యక్తి ప్రభావంతో అతడిలో ఛాందసవాదం, మతోన్మాద భావనలు మొగ్గ తొడిగాయని కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు గుర్తించారు.
పలు దశల్లో భారత్‌పై దాడులు చేయాలనుకుని సిరాజ్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. తొలుత భగ్వా లవ్ ట్రాప్ వ్యతిరేక పోరాటం పేరిట సమీకృతం చేయటం, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చూపించడం, చివరిగా భారత్‌పై యుద్ధం చేయడం ఇలా అంచెల వారీగా లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడైంది. గ్రూపు-2, ఎస్సై ఉద్యోగాల శిక్షణ కోసమంటూ సిరాజ్ హైదరాబాద్ బాటపట్టాడు. కానీ అతడు ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకే సమయం వెచ్చించినట్లు దర్యాప్తులో తేలింది. సిరాజ్‌ను విచారించినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కనిపించలేదని సమాచారం.
విజయనగరంలో ఉగ్రమూలాల కేసు - సిరాజ్ అకౌంట్లో రూ.42 లక్షలు
విజయనగరంలో ఉగ్రమూలాల కేసు - ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఆర్డర్!