Advocate Kidnapped in Hyderabad : హైదరాబాద్లో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేపింది. వనస్థలిపురం, ఎస్‌ఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్ నుంచి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణను ఇద్దరు దుండగులు కారులో కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు.
రూ.కోటి తీసుకుని అగ్రిమెంట్ : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వనస్థలిపురం సరస్వతినగర్ ఎస్‌ఎన్‌ఆర్ అపార్ట్మెంట్లో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణ నివాసం ఉంటున్నారు. 2020లో మేడ్చల్, కుత్బుల్లాపుర్‌లోని ఒక భూమి విషయంలో నారాయణ మధ్యవర్తిగా వ్యవహరించారు. దానిలో భాగంగా కోటి రూపాయలు తీసుకుని అగ్రిమెంట్ చేయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అయితే, నారాయణ భూమికి సంబంధించిన అగ్రిమెంట్ విషయంపై మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నారని, ఆదివారం ఆయనను ఇద్దరు వ్యక్తులు కారులో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన మధ్యవర్తిగా ఉండి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా స్పందించకపోవడంతోనే ఈ కిడ్నాప్ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేసున్నామన్నారు.
ముసుగులో వచ్చి శిశువును కిడ్నాప్ చేసిన కి'లేడీ' గ్యాంగ్! - హైదరాబాద్లో పాపను రక్షించిన పోలీసులు