Security Forces Discover Huge Tunnel In Karregutta : ఛత్తీస్‌గఢ్-తెలంగాణ బోర్డర్ కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. నక్సల్స్ కోసం ఇక్కడి అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కర్రెగుట్టలను అన్నివైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భారీ సొరంగాన్ని గుర్తించాయి. వెయ్యి మంది తలదాచుకునేందుకు వీలుగా సొరంగ నిర్మాణం ఉంది.
కర్రెగుట్టలోని సొరంగం లోపల పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల పాటు నక్సల్స్ ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
అన్ని కొండలను చుట్టుముట్టడం : కర్రెగుట్టలో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్‌కు గురయ్యారని, వారి పరిస్థితి మరింత విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ప్రస్తుతం ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నక్సల్స్ దాక్కున్న అన్ని కొండలను చుట్టుముట్టే వరకు ఈ ఆపరేషన్‌ను కొనసాగించాలని ప్రభుత్వం, భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
జల్లెడ పడుతూ కొండలపైకి : ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, పూజారికాంకేర్, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ జరుగుతోంది. రుద్రారం వరకు 90 కిలో మీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో భద్రతా బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి.
ముగ్గురి మృతదేహాలు లభ్యం : అతి కష్టం మీద శనివారం(ఏప్రిల్ 26) సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న భారీ సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సల్స్ మృతదేహాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లుగా విస్తృత ప్రచారం జరిగినప్పటికీ అధికారులు మాత్రం అధికారికంగా నిర్ధరించలేదు.
ములుగు జిల్లాలో నేడు మావోయిస్టుల బంద్.. ఏజెన్సీల్లో హై అలర్ట్
Karregutta Encounter: కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ.. 22న జిల్లా బంద్‌కు పిలుపు