SCHOOL BUS FITNESS TESTS: విద్యార్థుల రవాణాలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే రవాణాశాఖ, ఈ ఏడాది ఫిట్‌నెస్ తనిఖీలను మే 1వ తేదీ నుంచి ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని 1,725 పాఠశాల బస్సులకు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా చూసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఈ తనిఖీలు నిర్వహించడం సాధారణ ప్రక్రియ కాగా, విద్యాసంస్థలు జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే నేపథ్యంలో ఎఫ్‌సీ (ఫిట్‌నెస్ సర్టిఫికెట్) తీసుకోవడం తప్పనిసరి.
ప్రత్యక్ష తనిఖీ ద్వారా ఫిట్‌నెస్ ధ్రువీకరణ: బస్సులకు ఎఫ్‌సీ పొందాలంటే రవాణాశాఖకు దరఖాస్తు చేయాలి. అనంతరం సంబంధిత బస్సు లేదా వ్యానును అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేస్తారు. ఇంజిన్, గేర్ బాక్స్, బ్రేకులు, రివర్స్ గేర్ వంటి కీలక భాగాలను పరీక్షిస్తారు. వాహనాన్ని స్వయంగా నడిపి డ్రైవింగ్ పరిస్థితిని పరిశీలిస్తారు. అన్ని అంశాల్లో వాహనం సక్రమంగా ఉందని నిర్ధారణ అయిన తర్వాతే ఎఫ్‌సీ జారీ అవుతుంది. ఫిట్‌నెస్ లేకపోతే వాహనాన్ని సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికి 737 బస్సులకు మాత్రమే ఎఫ్‌సీ: ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 737 బస్సులే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాయి. ఇంకా రెండు వారాల గడువు ఉండటంతో మిగతా యాజమాన్యాలు తక్షణమే ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరై సర్టిఫికెట్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాది 84 బస్సులు ఎఫ్‌సీ లేకుండానే రోడ్లపై తిరిగినట్టు సమాచారం. కొంతమంది బస్సులను ఇతరులకు అమ్మేసిన కారణంగా కూడా నమోదు తేడాలు ఏర్పడినట్టు తెలుస్తోంది.
ఫిట్‌నెస్‌కు అనుసరించాల్సిన నిబంధనలు: ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పొందాలంటే కొన్ని కీలక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది:
- విద్యార్థులు ఎక్కేందుకు మెట్లు ఉండాలి.
- కిటికీలకు మెష్ ఉండాలి, చేతులు బయటకు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రథమ చికిత్సా పరికరాలు తప్పనిసరిగా ఉండాలి.
- రివర్స్ వ్యూ మిర్రర్‌తో పాటు బస్సులోపల మొత్తం కనిపించే అద్దం ఉండాలి.
- అత్యవసర ద్వారం, సురక్షిత సీట్లు కలిగి ఉండాలి.
- హెడ్‌లైట్లు, వెనుక లైట్లు, సిగ్నల్ లైట్లు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి.
ఏప్రిల్ 1 నుంచి వచ్చిన దరఖాస్తులు | ఈ ఏడాదికి వచ్చిన దరఖాస్తుల సంఖ్య |
మొత్తం బస్సుల సంఖ్య | 1725 |
ఎఫ్‌సీ తీసుకున్నవి | 737 |
ఎఫ్‌సీ తీసుకోనివి | 988 |
స్కూలు బస్సు బోల్తా-13 మంది చిన్నారులకు గాయాలు
కాల్వలోకి ఒరిగిన స్కూల్ బస్సు - చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం