Saraswati puskaralu provide Emloyment : ప్రసిద్ధ కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతుండగా, స్థానికులకు చేతినిండా ఉపాధి దొరుకుతోంది. స్థానికంగా ఉండే లాడ్జీలు, హోటళ్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ప్రయాణ ప్రాంగణంలో దిగిన భక్తులను ఘాట్‌ల వద్దకు చేరవేయడానికి సర్కారు ఉచిత షటిల్ బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, స్థానిక ఆటో వాలాలకూ గిరాకీ తగ్గలేదు.

పూజా సామగ్రి అమ్మేవారు, టీస్టాళ్లు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులు, రోడ్డు పక్కన కొబ్బరి కాయలు, జ్యూస్‌లు అమ్మేవారు, టెంట్‌హౌస్ నిర్వాహకులకు ఈ పుష్కరాల వల్ల ఉపాధి లభించింది. ‘‘సాధారణ రోజుల్లో రూ.1500 వరకు వ్యాపారం అయ్యేది. ఈ పుష్కరాల సమయంలో రూ.6 వేల వరకు అవుతోంది. దీంతో ఇద్దరు పనివాళ్లను పెట్టి వారికి రోజూ రూ.600 ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాను' అని పాత బస్టాండ్ ఎదుట ఉన్న హోటల్ నిర్వాహకుడు శివ తెలిపారు. ‘గతంలో రోజూ 80 వరకు టెంకాయలను అమ్మేది. ఇప్పుడు ఘాట్ వద్దే స్టాల్ ఏర్పాటు చేయడంతో కనీసం 300ల వరకు అమ్ముతున్నానని కొబ్బరికాయల విక్రేత శారద తెలిపారు.
పడవలో భక్తులను తీసుకెళ్తున్న గంగపుత్రులు : భక్తుల రద్దీ ఎక్కువైనప్పటీ కిరాణ దుకాణాదారులు, టిఫిన్ సెంటర్‌లు, టీస్టాళ్ల నిర్వాహకులంతా ఎంఆర్‌పీ ధరలనే తీసుకుంటున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలతో స్థానిక అధికారులు ఆ మేరకు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
సరస్వతీ పుష్కరాలు గంగపుత్రులకూ ఉపాధిని కల్పిస్తున్నాయి. గతంలో 7 పడవలతో జీవనోపాధి పొందేవారు. సరస్వతీ పుష్కరాలు వస్తున్నాయని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 80 మంది బృందం గల గంగపుత్రులు మరో పడవను కూడా కొనుగోలు చేశారు. తీరిక లేకుండా భక్తులను ఈ ఒడ్డు నుంచి ఆ దరికి చేరవేస్తున్నారు.
భక్తులకు ఉపయోగపడుతున్న వంతెనలు : కాళేశ్వరానికి పొరుగున ఉన్న రెండు అంతర్రాష్ట్ర వంతెనలు పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో జరిగిన పుష్కరాలకు భక్తులు గోదావరి ప్రవాహంలో పడవలను దాటి రావాల్సి వచ్చింది. 2016లో గోదావరిపై, 2019లో ప్రాణహితపై అంతర్రాష్ట్ర బ్రిడ్జి (వంతెన) నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో తెలంగాణలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ భక్తులు కాళేశ్వరం శివయ్య సన్నిధికి సులువుగా చేరుకుంటున్నారు. 2022లో జరిగిన ప్రాణహిత పుష్కరాలకు భక్తులు ప్రాణహిత నదిని దాటి సిరోంచలో పుణ్య స్నానాలు చేసి గోదావరిపై అంతర్రాష్ట్ర వంతెన మీదుగా కాళేశ్వరున్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం సరస్వతీ పుష్కరాలకు సైతం వాహనాల్లో రెండు వంతెనలను దాటి వస్తున్నారు.
ముగింపు దశకు చేరుకున్న సరస్వతీ పుష్కరాలు - బారులు తీరుతున్న భక్తులు
భక్తులకు గుడ్ న్యూస్ - 2 కిలోమీటర్లు నడవాల్సిన పని లేదు, పుష్కర ఘాట్ వరకు ఫ్రీ బస్