Saraswati Pushkaralu 2025 : కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభతో అలరారుతోంది. తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. నేటి నుంచి మొదలైన సరస్వతి పుష్కరాలు, ఈ నెల 26 వరకు సాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కాళేశ్వరానికి వచ్చి పుష్కర వేడుకల్లో పాల్గొంటారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్తేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణీ సంగమంగా పిలవబడుతుంది. 12 ఏళ్లకు ఒక నది వద్ద జరిగే పండుగే పుష్కరాలు. ఈసారి 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర సమయంలో ఆయా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి శుభప్రదంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం.
నదిపుట్టిన చోటుగా భావించే బదరి, గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థానమైన ప్రయాగ్‌రాజ్ గుజరాత్, రాజస్థాన్‌లోని సోమ్‌నాధ్ పుష్కర్‌లోనూ వేడుకలు జరుగుతాయి. కాళేశ్వరంలోని త్రివేణీ సంగమం వద్ద మూడు పుష్కరాలు జరగడం విశేషమే. ఇక్కడ ప్రవహించే ప్రాణహితకి రెండేళ్ల క్రితం పుష్కరాలు జరగ్గా, ఈసారి సరస్వతి నదికి, 2027లో గోదావరి పుష్కరాలు ఇలా మూడుసార్లు పుష్కరాలు జరగడం విశేషం.
పుష్కరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం విచ్చేస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద కొత్తగా నిర్మించిన సరస్వతి ఘాట్, భక్తుల కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు పుష్కర వేడుకల్లో పాల్గొంటారు.
రూ.35 కోట్లతో భక్తులకు సదుపాయాలు : సరస్వతి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కార్ రూ.35 కోట్లతో భక్తులకు సదుపాయాలు సిద్ధం చేసింది. పనులు కాస్త ఆలస్యమైనా గడువులోగా పూర్తి చేశారు. పుష్కర ఘాట్లని సర్వాంగం సుందరంగా తీర్చిదిద్దారు. జ్ఞాన సరస్వతిఘాట్‌ను 86 మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు. కోటి రూపాయలతో తమిళనాడులోని మహబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు.
24 టన్నుల బరువు 10 అడుగుల ఎత్తులో ఉన్న చదువుల తల్లి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాధారణ భక్తుల వసతి కోసం 50 టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు. ప్రతిరోజూ లక్షమందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. నదిలోకి వెళ్లి ప్రమాదాల బారినపడకుండా గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.
ప్రత్యేక సరస్వతి నవరత్న మాల హారతి : ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు తీరంచెంత . యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 గంటల వరకు ప్రత్యేక సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు. రోజూ రాత్రివేళ ప్రవచన కర్తల ప్రవచనాలు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
సరస్వతి నది పుష్కరాలు- తేదీ, సమయం, ఘాట్లు, పూజలు- పూర్తి వివరాలు మీ కోసం!
రేపటి నుంచే సరస్వతి పుష్కరాలు - మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు