Sandal Stand With Unique ID in Tirumala : తిరుమలలో చెప్పుల తిప్పలకు స్వస్తి పలికేలా టీటీడీ చర్యలు చేపట్టింది. యునిక్ ఐడీతో చెప్పుల స్టాండ్ నిర్వహణకు చర్యలు తీసుకుంటోంది. ఉచిత లగేజి కౌంటర్లలో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ (RFID) విధానాన్ని చెప్పుల స్టాండ్‌కు వినియోగిస్తూ భక్తులు తమ పాదరక్షలను సులభతరంగా తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించింది.
రోజు శ్రీవారి దర్శనానికి వచ్చే వేల మంది భక్తులు చెప్పులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్న తీరుకు ఇకపై తెరపడనుంది. చెప్పుల స్టాండ్ నిర్వహణలో ఆధునిక పరిజ్ఞానంతో సమస్య తీరబోతోంది. తిరుమాఢ వీధులు, అన్నప్రసాద కేంద్రాలు, ఆలయ పరిసర ప్రాంతాలు ఇలా పలు ప్రాంతాల్లో భక్తులు పాదరక్షలు ధరించడంపై నిషేధం ఉంది. దీంతో తిరుమల వచ్చిన భక్తులు తమ చెప్పులను భద్రపరచుకోవడం సమస్యగా మారింది.
రాంబగీచా, అన్నదానం, ఆర్టీసీ సర్కిల్, కళ్యాణకట్ట తదితర ప్రాంతాల్లో టీటీడీ చెప్పుల స్టాండ్‌లను ఏర్పాటు చేసింది. స్టాండ్లలో చెప్పులు వదలడం మినహా ఎక్కడ వదిలామో తెలుసుకోలేక, తెలిసినా గుట్టలుగా పడిన పాదరక్షల్లో తమవి గుర్తించలేక భక్తులు వాటిని అక్కడే వదిలేస్తున్నారు. వదిలేసిన చెప్పులు వారానికి ఓ లారీ చొప్పున చెత్త కుప్పలోకి టీటీడీ తరలిస్తోంది. చెప్పుల సమస్య పరిష్కారం కోసం ఉచిత లగేజి కౌంటర్‌లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ సిస్టం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
పైలెట్ ప్రాజెక్టుగా ఏటీసీ సర్కిల్‌లో కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తుల నుంచి చెప్పులు తీసుకొని ఫోటోతో పాటు మొబైల్ నెంబర్ నమోదు చేసి రశీదు ఇస్తున్నారు. భక్తుడి నుంచి తీసుకున్న చెప్పులను ఆర్ఎఫ్ఐడీ ఉన్న బ్యాగ్‌లో వేసి ర్యాక్ నెంబర్ ఆధారంగా స్కాన్ చేసి సిబ్బంది భద్రపరుస్తున్నారు. భక్తులు దర్శనం అయ్యాక తమ దగ్గర ఉన్న రశీదును స్కాన్ చేసి ఏ కౌంటర్‌లో, ఏ వరుసలో ఏ ర్యాక్‌లో చెప్పులు ఉన్నాయో గుర్తించి భక్తులకు తిరిగి అందిస్తున్నారు.
తిరుమలలో భద్రతా వైఫల్యం - శ్రీవారి మహాద్వారం వద్దకు చెప్పులతో భక్తులు
'ప్రయోగాతక్మంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతం కావడంతో తిరుమల వ్యాప్తంగా ఇదే పద్ధతిని అనుసరిస్తాం. అంతే కాకుండా దీన్ని మిగిలిన అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇది భక్తులకు ఊరటనివ్వడమే కాకుండా చెప్పులు వదిలి వెళ్లటం తగ్గుతుంది.' -వెంకయ్య చౌదరి, టీటీడీ అదనపు ఈవో
ఆధునిక ఉచిత చెప్పుల కౌంటర్లతో ఇటు భక్తుల ఆర్థిక నష్టం, అటు టీటీడీకి నిర్వహణ కష్టం తప్పుతోంది. టీటీడీ ఏర్పాటు చేసిన నూతన విధానంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో కౌంటర్లు తగ్గించారు- తొక్కిసలాటకు అదే ప్రధాన కారణం