Private Junior Colleges Irregularities : రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు తాము ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థికభారం తగ్గించుకునేందుకు పలు కళాశాలలు తక్కువగా స్టాఫ్‌ను నియమించుకుంటున్నాయి. తమ వద్ద తగినంత సంఖ్యలో అధ్యాపకులున్నట్లు ఆయా పేర్లను వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తున్నాయి. దీంతో చాలా చోట్ల లెక్చరర్లు కేవలం కాగితాలపైనే ఉంటున్నారు.
నిబంధనల తనిఖీ ఎక్కడ : దీంతో ఒక్కో అధ్యాపకుడి పేరు రెండు మూడు కాలేజీల రికార్డుల్లో కనిపిస్తుంది. దీనిపై ఇంటర్‌బోర్డు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అనుబంధ గుర్తింపు (ఎఫిలియేషన్) ఇవ్వడం, ఫీజులు వసూలు చేసుకోవడం తప్ప కాలేజీలు నిబంధనలను పాటిస్తున్నాయో లేదో అస్సలు పట్టించుకోవడంలేదు.
సంస్కృతం, ఇంగ్లీష్ అధ్యాపకుల పేర్లే తెలియదు : తెలంగాణలో 1400 వరకు ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 635 ఉన్నాయి. బోర్డు నిబంధనల ప్రకారం ఒక అధ్యాపకుడు ఒకే కళాశాలలో పనిచేయాలి. ప్రస్తుతం కొంతమంది అందుకు భిన్నంగా రెండు మూడు కళాశాలల్లో లేదా బ్రాంచీల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా సంస్కృతం, ఇంగ్లీష్ బోధించే అధ్యాపకులు అనేక కళాశాలల్లో కేవలం కాగితాలపైనే ఉంటున్నారు.
30కి బదులు 60పేపర్లు : ఒకవేళ వారు వచ్చినా వార్షిక పరీక్షలకు 15-20 రోజుల ముందే కాలేజీలల్లో కనిపిస్తారు. రోజుకు అయిదారు కళాశాలల్లో క్లాసులు చెప్తుంటారు. వారిపేర్లు కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి. ఏటా సంస్కృతం పేపర్లను దిద్దేందుకు అధ్యాపకులు దొరకడం లేదు. ఉన్న కొద్ది మందికే రోజుకు 30 బదులు 60 సమాధానపత్రాలిచ్చి కరెక్షన్ చేయిస్తున్నారు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యను ప్రశ్నించగా ఈసారి వీటన్నిటికీ ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందిస్తామన్నారు.
ఆధార్ లింక్ చేస్తే చెక్ పెట్టొచ్చు : ఏటా జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఆ తర్వాత మార్చిలో వార్షిక ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇన్విజిలేటర్ల కోసం లిస్ట్ సేకరిస్తారు. విచిత్రంగా ఏటా ఒకే అధ్యాపకుడి పేరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి పంపిస్తున్నారని జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ అధికారి ఒకరు చెప్పారు. జేఎన్‌టీ యూనివర్సిటీ బోగస్ అధ్యాపకులను నియంత్రించేందుకు వారి ఆధార్‌ను లింక్ చేసింది. ఇంటర్‌బోర్డు కూడా దీన్ని అనుసరించాలన్న సూచనలు బలంగా వస్తున్నాయి.
18 గంటలు పుస్తకాలతోనే కుస్తీ! - అవి వసతి గృహాలా? - ప్రైవేట్ బందీఖానాలా?