Safety Tips for Women in Night Journey : ఆ ప్రాంతం మనకు తెలిసినదే, ఏళ్లుగా తిరిగిన ప్రదేశమే అయినా చీకటివేళ కొంత భయపెట్టగలదు. ఆ సమయంలో ఎవరో ఒక్కరు కనిపించినా ఆధారపడొచ్చు అనిపిస్తుంది. ఆ వచ్చింది మంచి వ్యక్తే అయితే పర్లేదు. కానీ మాటు వేసిన వేటగాడైతే? స్నేహితుడని నమ్మి అత్యాచారానికి గురైన జర్మనీ అమ్మాయి పరిస్థితే ఎదురవ్వొచ్చు. వచ్చింది క్యాబ్ డ్రైవర్ అనుకుని వెళ్లి ఏకంగా ప్రాణాలే కోల్పోయిన పుణె టీనేజర్ గతే పట్టొచ్చు. ఆ ఆపదలలు మనదాకా రావద్దంటే జాగ్రత్త పడాల్సిందే!
కొద్దిదూరమే అయినా : అయిదూ పది నిమిషాలు నడిస్తే చేరుకుంటాం కదా, ఆటో కోసం వేచిచూసే బదులు నాలుగడుగులు వేస్తే ఆరోగ్యం కూడా! ఈ మాత్రానికి డబ్బులు ఎందుకు పెట్టడం దండగ, ఇలా అనుకుని వేళ కాని వేళ నడుస్తూ వెళ్తున్నారా? ఆ సమయంలోనూ ఫోన్ చూస్తూ, కాలక్షేపమని పాటలు వింటూ వెళ్లొద్దు. అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మనం వెళ్లాల్సిన వైపు చీకటి దారులైతే ఎంత షార్ట్‌కట్ అయినా అటునుంచి వెళ్లకపోవడమే మేలు. వెలుతురు ఉండే మార్గాల్లోనే భద్రత ఎక్కువ. జనాలు కనిపించే, సీసీటీవీలు, ఇళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలైతే ఇంకా సురక్షితం.
పొద్దుగూకగానే ముసుగు తన్నే రోజులా ఇవి? పననో, కాలక్షేపమనో ఏ అర్ధరాత్రో దాటితేగానీ నిద్రపోరు. అలాంటి స్నేహితులు మీలో ఎవరున్నారో గుర్తించండి. ‘ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను వెళ్లేవరకూ గమనించు’ అంటూ లైవ్ లొకేషన్ షేర్ చేయండి. కాల్ చేసి ఇంటికి చేరానని చెబితేనే సురక్షితమని గ్రహించమనండి. వీలుంటే ఒక కోడ్‌నీ పెట్టుకుంటే మరీ మంచిది. చేతిలో పట్టేలా, సులువుగా తీసుకునేలా పెప్పర్ స్ప్రే, పక్కన బటన్‌ని నొక్కి వదిలితే అత్యవసర పోలీసు విభాగానికి కాల్ వెళ్లేలా ఫోన్ సెట్టింగుల్లో పెట్టుకోవడం వంటివీ సాయపడతాయి. నైట్‌షిఫ్ట్ మహిళలైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. రోజూ ఒకేదారిలో కాకుండా తరచూ దారి మారుస్తూ వెళితే మేలు. ఎందుకంటే మీరు ఎప్పుడు, ఏ సమయానికి వెళ్తుంటారు, వస్తుంటారని గమనించి అదును చూసి అవకాశంగా మార్చుకునే కేటుగాళ్లు ఉండొచ్చు
క్యాబ్ బుక్ చేశారా? : వచ్చిన డ్రైవర్, వాహనం వివరాలు యాప్‌లో చూపినట్టుగానే ఉన్నాయా అని గమనించుకోండి. ఒక్కోసారి అక్కడ చూపించే వివరాలకీ వచ్చినవారికీ సంబంధం ఉండదు. పగలైతే పర్లేదు. కానీ రాత్రుళ్లు రిస్క్ తీసుకోవద్దు. ‘యాప్ వాళ్లే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. మాకు నష్టం, క్యాన్సిల్ చేసి అదే ధరకు తీసుకెళ్తామన్నా వద్దనే చెప్పండి. ఒకవేళ అతని మాటలు విని క్యాన్సిల్ చేస్తే ట్రాకింగ్‌తోపాటు ఏదైనా తేడా వస్తే ఫిర్యాదు చేసే వీలూ కూడా ఉండదు. అదీ మంచిది కాదు. ఇవన్నీ సరిగ్గానే ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి.
శక్తి యాప్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం: హోంమంత్రి అనిత
ఇంట్లోవాళ్లు, స్నేహితులకు లైవ్ లింక్ పంపండి. లైవ్ ఆగితే వెంటనే ఫోన్ చేయమనండి. మీరూ కాలక్షేపంగా ఉంటుందని సినిమా, సోషల్ మీడియాలతో గడపొద్దు. చుట్టూ గమనించుకుంటూ ఉండాలి. వేరే మార్గంలో తీసుకెళితే వెంటనే ప్రశ్నించండి. భయపడకుండా మీవాళ్లకు ఫోన్ చేసి, ఏ దారిలో తీసుకెళుతున్నారో చెబుతూ ఉండండి. ఇవన్నీ స్వీయరక్షణ చర్యలే. ‘ఫ్రెండ్స్ మధ్యలో దిగేస్తార’ని ఎవరినైనా ఎక్కించుకుంటే ఒప్పుకోవద్దు. ప్రవర్తన, మాటతీరుల్లో తేడా కనిపిస్తే మధ్య దారి అయినా సరే కాస్త జనాలు ఉన్నచోటు చూసుకుని దిగిపోండి. డబ్బుల కంటే భద్రతే ముఖ్యం.
కొత్త చోటుకెళితే! : బస్సు, రైళ్లు వీలైనంతవరకూ వెలుగొచ్చాకే దిగేలా చూసుకోవడం మేలు. అన్నిసార్లూ అది వీలవ్వదు. తెల్లారకముందే మీ గమ్యాన్ని చేరుకుని దిగాల్సి వస్తే తీసుకెళ్లడానికి మీవాళ్లను ఎవరో ఒకరిని రమ్మని చెప్పండి. ఆ అవకాశమూ లేకపోతే రైల్వేస్టేషన్‌ల్లో అయితే సేదతీరే గదులు ఉంటాయి. వాటిని బుక్ చేసుకోవచ్చేమో చూడండి. లేదా వేచి చూడటానికే ప్రాధాన్యమివ్వండి.
ఎంత ధైర్యవంతులైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నా, ఏళ్ల తరవాత వచ్చినా కాస్త కంగారు మామూలే. దాన్ని ఆపద తలపెట్టాలనుకునేవాళ్లు ఇట్టే గమనిస్తారు. నమ్మకం కలిగించడానికి ‘అక్క, చెల్లి’ అని మాట కలుపుతారు. ఇలా అన్నవాళ్లంతా చెడ్డవాళ్లే అనుకోనక్కర్లేదు. అలాగని ముఖమ్మీద చెడ్డవాళ్లు అనీ రాసుండదు కదా! మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితే అయితే ఏయే దారుల్లో వెళ్లొచ్చో మ్యాప్‌ల్లో పిన్ చేసి పెట్టుకోండి. పేరున్న క్యాబ్ సర్వీసుల నుంచి బుక్ చేసుకోవడానికే మొగ్గుచూపండి. వీలుంటే బస్సు, షేరింగ్ ఆటోలను ఆశ్రయించినా మేలే. జరిగినవన్నీ వేరే చోట్ల, మనదగ్గర అలాంటివాటికి ఆస్కారం లేదన్న ధీమా వద్దు. ముప్పు ఎక్కడైనా, ఎప్పుడైనా పొంచి ఉండొచ్చు. కాబట్టి, అలసత్వం వదిలి జాగ్రత్త పడటమే దారి!
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రణాళికలు: డీజీపీ