Precautions To Heavy Rains in kurnool District: కర్నూలు జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వీస్తున్న ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు, తీగలు, నేల వాలుతుండటంతో తరచూ విద్యుత్తు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్తు శాఖాధికారులు సూచిస్తున్నారు. తడిసిన స్తంభాలు, స్టేవైర్లు, సపోర్టింగ్ తీగలు, ఇతర పరికరాలను తాకితే ప్రాణాపాయం కలుగుతుందని చెబుతున్నారు.
ఇళ్లల్లో వేలాడుతున్న తీగల కారణంగా పైపులకు, గోడలకు విద్యుత్తు సరఫరా జరిగి మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు జాగ్రత్తలు పాటించకపోవడంతో వ్యవసాయ మోటార్లు, పొలాలకు రక్షణగా ఉంచిన విద్యుత్తు తీగలను తాకి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. కొద్దిపాటి జాగ్రత్తలు, మెళకువలతో ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని అవగాహన కల్పిస్తున్నారు.
విద్యుత్ ప్రమాదాలపై జరభద్రం: వర్షాలు కురిసే సమయంలో స్తంభాలు, స్టేవైర్లు, సపోర్టింగ్ తీగలు, ఇతర విద్యుత్తు పరికరాలను చేతితో ముట్టుకోరాదు. తడిసిన, తక్కువ ఎత్తులో వేలాడుతున్న తీగలు శరీరానికి తగలకుండా జాగ్రత్త పడాలి. ఇళ్ల ముందు, ఇళ్ల పైన బట్టలు ఆరవేసేందుకు ఇనుప తీగల బదులు నైలాన్ తాళ్లను ఉపయోగించుకుంటే మంచిది. ఇంటిలో ఐఎస్‌ఐ నాణ్యత కలిగిన పరికరాలను వాడుకుంటే మంచిది. ఇళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు ఇన్సులేషన్(పైపొర) దెబ్బతిన్నట్లు గుర్తిస్తే తక్షణమే వాటిని మార్చుకోవాలి.
అప్రమత్తత అవసరం: రైతులు తమ పొలాల్లోని వ్యవసాయ మోటార్లకు ఎర్తింగ్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ మోటార్లు మరమ్మతులకు గురైతే నైపుణ్యం గల ఎలక్ట్రీషియన్లతో మరమ్మతులు చేయించుకోవాలి. పశువులను మేతకు తీసుకెళ్లేప్పుడు అవి నియంత్రికలు, స్తంభాల దగ్గరకు వెళ్లకుండా చూడాలి. ఈదురుగాలులకు ఎక్కడైనా స్తంభాలు, తీగలు తెగిపడి ఉంటే అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. వ్యవసాయ మోటార్లు, స్టాటర్లను నేరుగా చేతితో ముట్టుకోవద్దు. మోటారు, ఫుట్‌వాల్వ్‌లకు సర్వీసువైర్లు తగలకుండా చూసుకోవాలి. ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజులు మార్చడం, ఏబీ స్విచ్‌లు నియంత్రించడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. సమస్యలు ఏర్పడినప్పుడు స్థానిక లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వాలి. ఎవరైనా, ఎక్కడైనా విద్యుదాఘాతానికి గురైతే వెంటనే అప్రమత్తమై ప్లాస్టిక్ పైపు లేదా ఎండిన కర్రతో రక్షించే ప్రయత్నం చేయాలి. చేతులతో పట్టుకోరాదు.
ప్రమాదాల నివారణకు సూచనలు: అకాల వర్షాలు కురిసేటప్పుడు విద్యుత్తు వినియోగదారులు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్తు సంబంధ సమస్యలున్నప్పటికీ వినియోగదారులు, రైతులు సొంతంగా మరమ్మతులు చేసుకోవద్దు. ఏపీఎస్పీడీసీఎల్ వారి 1912 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారమివ్వాలి. విద్యుత్తు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా అకాల వర్షాలు కురిసినప్పుడు, ఈదురు గాలులు వీచినప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది. ఎక్కడ విద్యుత్తు సమస్యలు తలెత్తినా సంబంధిత లైన్‌మెన్‌కు, ఏఈ, ఏడీఈలకు సమాచారమివ్వాలి. స్థానిక ఎలక్ట్రీషియన్లతో ఎల్‌సీ(లైన్ క్లియర్) తీసుకోకుండా సొంత ప్రయోగాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దు.
అలర్ట్ - ఏపీలో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షం
నెల్లూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలు - వరదలో ఇద్దరు యువకులు గల్లంతు