SAEL Solar Plant in AP : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పచ్చజెండా ఊపుతూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మరో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఎస్‌ఏఈఎల్ సోలార్ ఎంహెచ్‌పీ1 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.1130 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో ఎస్‌ఏఈఎల్ 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకుంది. ఆ సంస్థతో డిస్కంలు కరెంట్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. విద్యుత్ ఎక్స్‌పోర్ట్ పాలసీ నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్ నుంచి వచ్చే కరెంట్‌ను తొలి ప్రాధాన్యత కింద రాష్ట్రం కోరితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఆ కరెంట్‌ను ఇతర రాష్ట్రాల్లో సంస్థ విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది.
Solar Investments in AP : ఎస్‌ఏఈఎల్ సంస్థ 6.5 గిగావాట్ల కంటే ఎక్కువ ఇండిపెండెంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అధునాతన టన్నెల్ ఆక్సైడ్ పాసివేటెడ్ కాంటాక్ట్ సాంకేతికతను వినియోగించి 3.5 గిగావాట్ల సామర్థ్యం ఉన్న సౌర మాడ్యూల్ తయారీ యూనిట్‌నూ నిర్వహిస్తోంది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లలో 11 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. వాటి ద్వారా ఏటా 2 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలను సంస్థ వినియోగిస్తోంది.
ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోనున్నట్లు ఎస్‌ఏఈఎల్ పేర్కొంది. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, సొసైటీ జనరల్ గ్రూపులు ఒక్కొక్కటి రూ.377 కోట్ల చొప్పున అందిస్తాయని సెకికి దాఖలు చేసిన బిడ్డింగ్ ప్రతిపాదనలో తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రాజెక్ట్ అమలు, అభివృద్ధి, నిర్వహణకు సంస్థ వినియోగించనుంది. విద్యుత్ ఎక్స్‌పోర్ట్ పాలసీ కింద 16,000ల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఐదు అల్ట్రా మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 12,200 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించింది.
ఈ ఒక్క పని చేస్తే చాలూ - 25 ఏళ్లు కరెంట్ బిల్లు రాదు
డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ - తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు