Saddula Bathukamma Celebrations in Telangana : ఇంద్ర ధనస్సులోని వర్ణాలు కలిగిన రకరకాల పూలతో అలంకరించిన బతుకమ్మ ఇవాళ జగమేలుతోంది. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. తెలంగాణ సంప్రదాయన్ని విదేశాల్లోనూ పాటిస్తున్నారు. అక్కడ స్థిరపడ్డ మనోళ్లంతా బతుకమ్మ పండగ అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ ఒకసారి, చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, ఒక్కోసి పువ్వేసి సందమామ అని, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మమ్మేలు కోవమ్మ ఉయ్యాలో అంటూ ఇలా బతుకమ్మ పాటలతో ఆ ప్రాంతాలు మారుమోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ పండగను నిర్వహించనున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
16 ఏళ్లుగా ఒక్కో అడుగు పెంచుతూ : వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చెందిన రుద్రారపు సరోజన, పైడయ్య దంపతులు ప్రతి సంవత్సరం తొమ్మిది రకాల పూలతో ఒక అడుగు పెంచుతూ పెద్ద బతుకమ్మను పేరుస్తున్నారు. 16 ఏళ్ల క్రితం తొలిసారి మూడు అడుగుల ఎత్తులో బతుకమ్మను పేర్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుతూ వస్తున్నారు.
ఈసారి సైతం దాదాపు 12 అడుగుల ఎత్తులో బతుకమ్మను పేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పలువురు కూలీలతో వారం రోజులుగా పెట్టి కొత్తగూడ, గంగారం, పాకాల అడవుల్లో గునుగు, టేకు, తంగేడు, తామర, అల్లీ పూలు, బంతి, సీతజడ, చామంతి వంటి తొమ్మిది రకాల పూలను సేకరిస్తున్నారు. ఇంట్లోని మహిళాలతో వాటిని కట్టలు కట్టిస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాలీలో బతుకమ్మను మైదానానికి భాజాభజంత్రీలతో తీసుకొస్తారు.
కన్నడీలకు మక్కువ : బతుకమ్మ పండగను తెలంగాణ వాళ్లే కాకుండా కన్నడ ప్రజలు సైతం బాగా ఇష్టపడుతున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లా హళబిడ గ్రామానికి చెందిన అయ్యంగార్ యమున, రాజు దంపతులు పదేళ్ల క్రితం నర్సంపేటకు వచ్చి స్థిరపడ్డారు. అక్కడి ప్రజలు పూలను ఆరాధించే సంస్కృతి వారికి బాగా నచ్చింది. దీంతో వారు కూడా సొంతంగా బతుకమ్మ పేర్చి ఇక్కడి మహిళలతో ఆడుతున్నారు.
పురుషులూ బతుకమ్మ ఆట ఆడుతారు : హసన్‌పర్తి మండలం సీతంపేటలో కులస్థులు దీపావళి పండగ సమయంలో నేతకాని కులస్థులు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్థులు కొనసాగిస్తున్నారు. దీపావళి రోజు పుట్టమన్ను తీసుకొచ్చి ఇళ్లలో జోడెడ్ల ప్రతిమలను తయారు చేసి పూజిస్తారు. మరుసటి రోజున కేధారేశ్వర వ్రతం చేస్తారు. అనంతరం జోడెడ్లను అలంకరించి ఊరేగిస్తారు. తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. మరుసటి రోజున సద్దుల బతుకమ్మను నిర్వహించి మహిళలతోపాటు పురుషులు కూడా బతుకమ్మ ఆట ఆడుతారు.
విదేశాల్లోనూ సందడే : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా బతుకమ్మ పండగ నిర్వహిస్తున్నారు. యూకేలోని వారిక్ పట్టణంలోనూ ఉత్తరాది దక్షణాది సంస్కృతుల మేళవింపుగా వేడుకలు జరుగుతాయని తెలుగు ఆడపడుచు, అక్కడి కౌన్సిలర్ ఎల్లాప్రగడ హేమ పేర్కొన్నారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం విదేశీ మహిళలు కూడా ఆసక్తిగా గమనించి తమతో కలిసి వస్తున్నారని తెలుగు మహిళలు చెబుతున్నారు.