Ryhtu Bharosa Funds Released Today : రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త తెలిపారు. సాగు భూములకు రైతు భరోసా కింద ఒక ఎకరం వరకు ఈరోజు 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు భరోసా ప్రారంభించినప్పుడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఇప్పటివరకు రూ.1,126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా : జనవరి 26న ప్రారంభోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 563 గ్రామాలలో 9లక్షల 48వేల 333 ఎకరాలకు రూ.4,41,911మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.569 కోట్ల పెట్టుబడి సాయం బ్యాంకుల్లో వేశారు. విడతల వారీగా రాష్ట్రంలోని వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలోనే చెల్లించేందుకు కృత నిశ్చయంతో ఉందన్నారు.
పంటలు పండిన భూముల లెక్కేసిన సర్కార్ : రైతు భరోసా కేవలం సాగు భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుని పరిశీలించింది. దాదాపు 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు గుర్తించింది. దీంతో వీటిని ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా చెల్లించాలనుకుంటుంది. ఈ మేరకు అవసరమైన నిధులను సిద్ధం చేసుకుంది. సాగుకు యోగ్యమైన భూమి కుడా ఇంతకు మించి ఉంటే అవకాశం లేదని ప్రభుత్వం అంచనా వేసింది. 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధం అవుతుండగా, ఇక నుంచి సాగు చేయలేని భూములకు రైతు భరోసా వేయకూడదని నిర్ణయించుకున్నారు.
ఇక నుంచి వీరికి కూడా అవకాశం : అయితే కొత్తగా పట్టదారు పాసు పుస్తకాల పొందడం, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వాహణ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మంది రైతుబంధు నిలిచిపోయేది. ఇప్పుడా సమస్యలను సరిచేసుకుని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద సమర్పిస్తే వారి వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
'రైతు భరోసా' డబ్బులు ఈరోజు రావు - ఖాతాల్లోకి నగదు బదిలీ ఎప్పుడంటే?