మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆర్టీసీ సన్నద్ధత - ఆ బస్సులు కూడా కీలకం కానున్నాయి!
జోన్లవారీగా అధికారులు, డిపో మేనేజర్లతో సమీక్షలు - తొలుత మూడు నెలలు అధిక రద్దీ ఉంటుందని అంచనా

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 2, 2025 at 9:56 AM IST
APSRTC Ready For Free Bus Scheme For Women In AP: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనుండటంతో దీనికి ఏపీఎస్‌ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఎక్కువ బస్సులు అందుబాటులో ఉండేలా చూడటం, అదనపు డ్రైవర్లను సమకూర్చుకోవడం, కండక్టర్లకు శిక్షణపై అధికారులు దృష్టిపెట్టారు. సంస్థలో 11,449 బస్సులు ఉండగా, అందులో పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అన్నీ కలిపి 8,548 (74 శాతం) ఉన్నాయి. పథకం అమలులో ఇవే కీలకం కానున్నాయి. సాధారణంగా ప్రతి డిపోలో కొన్ని బస్సులు స్పేర్ కింద పక్కన పెట్టేవి కూడా ఆగస్టు 15 నుంచి ఈ బస్సులనూ రోడ్డెక్కించనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ 371 స్కూల్ బస్సులు నడుపుతోంది. ఇవి ఆయా నగరాలు, పట్టణాలకు సమీపంలోని గ్రామాలకు ఉదయం వెళ్లి విద్యార్థులను బడులకు తీసుకొస్తాయి. మళ్లీ సాయంత్రం బడుల నుంచి ఊళ్లకు తీసుకెళ్తాయి. మిగిలిన సమయమంతా డిపోలోనే ఉంటాయి. ఇకపై మిగిలిన సమయంలో ఈ బస్సులను కూడా ఇతర రూట్లలో నడపనున్నారు.
ప్రయాణికులతో సహనంగా వ్యవహరించండి: పథకం మొదలయ్యాక తొలి మూడు నెలలు అధిక రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారని, దీనివల్ల అన్ని బస్సుల్లో రద్దీ పెరగనుందని భావిస్తున్నారు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు తగిన సూచనలు చేస్తున్నారు. రద్దీ సమయంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసినా సహనంగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు.
మహిళలకు వేరుగా టికెట్లు: ఉచిత ప్రయాణం అమలు ఉన్న బస్సుల్లో మహిళలకు వేరుగా జీరో టికెట్లు ఇవ్వనున్నారు. మగవారికి సాధారణ టికెట్లు, మహిళలకు జీరో టికెట్లు ఇస్తారు. భర్త, భార్య ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్, భార్యకు జీరో టికెట్ రెండూ వేర్వేరుగా జారీ చేస్తారు. జీరో టికెట్ల జారీపై కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత టిమ్స్‌లలో కొత్తగా ఉమెన్ ఫ్రీ టికెట్ అనే ఆప్షన్ తీసుకొస్తున్నారు.
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం: ఉచిత బస్సు పథకంపై మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, అనిత, సంధ్యారాణితో కూడిన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 4న సమావేశం కానుంది. ఆ తర్వాత 6న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ స్కీం గురించి నిర్ణయం తీసుకొని అధికారికంగా విధివిధానాలు ప్రకటించనున్నారు. ఈ పథకానికి ‘స్త్రీశక్తి’ అనే పేరు పెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ టికెట్ చక్కర్లు కొడుతోంది. అది డమ్మీ టికెట్ అని, పథకం పేరు ఇంకా ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.
ఉచిత బస్సు ప్రయాణానికి ఏం ఉండాలి? - క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఛైర్మన్
ఫ్రీ బస్ స్కీమ్‌కి పేరు ఫిక్స్ - రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు

