కొత్తగా 1500 బస్సుల కొనుగోలుకు నిర్ణయం - సౌకర్యాలపై ఆర్టీసీ ఎండీ ఆరా
60 డిపోల్లోని బస్సుల్లో 100 శాతం ఓఆర్ నమోదు - ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్టాండును పరిశీలించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 19, 2025 at 3:17 PM IST
|Updated : September 19, 2025 at 5:22 PM IST
RTC MD Dwaraka Tirumala Rao Visit To Anantapur District: ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్తగా 1500 బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్టాండ్, డిపోను జోన్ ఛైర్మన్ పూల నాగరాజుతో కలిసి గురువారం తనిఖీ చేశారు.
ఇప్పటికే 1050 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు అయ్యాయని తెలిపారు. అవి మరో నెల రోజుల్లో అందుబాటులోకి రావడానికి అవకాశం ఉందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని చెప్పారు. అవసరం మేరకే ప్రయాణించాలని ఆ కార్యక్రమం ప్రారంభం రోజున సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన పిలుపుతో వారు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల విజయవంతమవుతోందని తెలిపారు. ఆ పథకం ప్రారంభానికి ముందు మహిళల సంఖ్య 40 శాతం, పురుషుల సంఖ్య 60 శాతంగా ఉండేదని వివరించారు. ప్రస్తుతం మహిళలు 65 శాతం, పురుషులు సంఖ్య 37 శాతం ఉందని పేర్కొన్నారు. సగటున ఓఆర్ శాతం 69 నుంచి 80 శాతానికి పెరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం బస్సులలో ఓఆర్ శాతం 90గా ఉందని తెలిపారు.
రాష్ట్రంలో 129 డిపోల ఉన్నాయి. కానీ 60 డిపోలలో మాత్రమే 100 శాతం ఓఆర్ నమోదు అవుతోందని అని అన్నారు. ఈనెల రావులపాలెం డిపో పరిధిలో 130 శాతం ఓఆర్ నమోదయ్యిందని వెల్లడించారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వారికి అనుగుణంగా ప్రయాణ ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలను మెరుగు పరుస్తున్నామని తెలిపారు. బస్సులు మరమ్మతులకు గురికాకుండా ప్రత్యేక చొరవ చూపుతున్నామని వివరించారు. అంతకు ముందు ఆయన ప్రయాణ ప్రాంగణంలో, ఆర్టీసీ బస్సులోనూ మహిళలతో మాట్లాడారు. అనంతరం ఆయన ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.
‘ఇప్పటికే 1050 విద్యుత్తు బస్సులు కొనుగోలు చేశాం. అవి నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోంది. స్త్రీ శక్తి పథకం బస్సుల్లో ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) శాతం 90గా ఉంది. రాష్ట్రంలో 129 డిపోలు ఉండగా, 60 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదు అవుతోంది.’ - ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు
గుత్తి బస్టాండును పరిశీలించిన ఆర్టీసీ ఎండీ: గుత్తి ఆర్టీసీ బస్టాండు పునర్నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అనంతపురం జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్న ఆయన పెచ్చులూడి శిథిలావస్థకు చేరిన గుత్తి బస్టాండు భవనాన్ని పరిశీలించారు. గతంలో గుత్తి బస్టాండులో రెండుసార్లు బస్సు కోసం ప్లాట్ ఫారంపై వేచి ఉన్న ప్రయాణికులపై పైకప్పు పెచ్చులూడి పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుత్తి ఆర్టీసీ అధికారులు ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. భవనం శిథిలమై ప్రమాదకరంగా ఉందని, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు.

అనుకోని ప్రమాదం జరిగితే ఇబ్బందులు వస్తాయని అధికారులు తెలిపారు. బస్టాండు ఆవరణలో శిథిలమైన భవనాలను పరిశీలించారు. కొత్త బస్టాండు భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ను ఎండీ చూశారు. కొత్తగా బస్టాండు భననం నిర్మాణం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని ఆయన అధికారులకు చెప్పారు. బస్టాండుకు వస్తున్న బస్సులు ఎక్కడానికి ప్రయాణికులు గుంపులుగా వెళ్లడాన్ని పరిశీలించిన ఎండీ ఎందుకు ఇంత రద్దీ ఉందని అధికారులను ప్రశ్నించారు. స్త్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం మొదలయ్యాక బస్సులు రద్దీగా పెరిగిందని అధికారులు ఎండీకి వివరించారు.
లాభాల బాటలో ఆర్టీసీ - మూడు నెలల్లో కొత్త బస్సులు
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సులకు త్వరలోనే లైవ్ ట్రాకింగ్

