Rowdysheeters Attack On Public in Nellore: నెల్లూరులో ఒంటరిగా కనపడితే చాలు ముఠాగా ఏర్పడి అడ్డుకుంటున్నారు. కత్తులు, నెయిల్ కట్టర్ లాంటి ఆయుధాలు చూపిస్తారు. నగదు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. ఉన్నదంతా దోచుకుంటారు. మత్తు, మద్యం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రులు, తెల్లవారు జామున రోడ్లపై తిరుగుతున్న వారిని అడ్డుకొని దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు పట్టుబడిన వారంతా పాత నేరస్థులే కావడం నగరంలో పోలీసింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క నెలలోనే ఇలాంటివి మూడు ఘటనలు చోటు చేసుకోవడంతో జనం ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు.
రెండు వారాల క్రితం ఓ వృద్ధుడు హైదరాబాద్ నుంచి నెల్లూరుకు రైలులో తెల్లవారు జామున వచ్చారు. రైలు దిగి ఆటో కోసం ఆత్మకూరు బస్టాండ్ వద్దకు వస్తుండగా ముగ్గురు యువకులు ఆయన్ని అడ్డుకున్నారు. కత్తులతో బెదిరించి ఉన్నదంతా దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
ఈ నెల 24న రంగనాయకుపేట వద్ద ఓ వ్యక్తి తెల్లవారు జామున రోడ్డుపైకి రాగా ముగ్గురు యువకులు కత్తి, ఇటుక రాయితో బెదిరించారు. నగదు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. రూ.1500 తీసుకుని పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.
ఇటీవలే ఇద్దరు యువకులను నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు. వీరు కూడా నగదు కావాలని బెదిరించి దోపిడీ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అరెస్టు చేశారు. ఈ నెల 28న బోడిగాడి తోట వద్ద ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు దోపిడీ చేశారు. వారిని నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు.
భయం లేకుండా పోయింది: రాజకీయ జోక్యం, ఇతరత్ర కారణాలతో పోలీసులు అంటేనే భయం లేకుండా పోతోంది. కొందరు ఇదే అదునుగా తీసుకుంటున్నారు. పోలీసులు లాఠీకి పని చెప్పడం లేదు. దీంతో వారికి భయం లేకుండా పోతోంది. అర్ధరాత్రి అయ్యే వరకు జులాయిలుగా తిరగడం, నగదు ఇవ్వాలని బెదిరించి దోపిడీ చేయడం, చోరీలకు పాల్పడం వంటివి చేస్తున్నారు. పోలీసులు అప్రమత్తమై గస్తీలు పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
విశాఖలో దోపిడీ దొంగల బీభత్సం.. అడ్డొచ్చిన మహిళపై..!!
దోపిడి దొంగల బీభత్సం- హైవేపై వాహనాల్లో నిద్రిస్తున్న వారిపై దాడి - ROBBERY ATTACK