పురాతన పద్ధతిలో ఆలయాలకు మరమ్మతులు - సున్నం, బెల్లం, కరక్కాయలతో మిశ్రమం
ఏపీలోని ఆలయాలకు పురాతన పద్ధతిలో మరమ్మతులు - శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం దేవాలయాల పరిరక్షణకు చర్యలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 9, 2025 at 8:26 AM IST
Roof Repairs of Iconic Temples in AP: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అద్భుతమైన శిల్పకళ, ఆకట్టుకునే కట్టడాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి ఎంతోమంది వస్తుంటారు. వందల ఏళ్లనాటి పురాతన ఆలయాలను పరిరక్షించేందుకు, మరమ్మతులు చేసేందుకు భారతీయ పురావస్తుశాఖ (ASI) చర్యలు చేపడుతోంది. అయితే ఆ శాఖ పరిధిలోకి రాని ఆలయాలు, చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి. ఆ దేవాలయాలు పాడైతే వాటిని నిర్వహిస్తున్న సంస్థలు అవగాహన లేమితో సిమెంట్, కాంక్రీటు వంటి పదార్థాలతో మరమ్మతులు చేపిస్తున్నారు. దీనివలన వాటి నాణ్యత దెబ్బతింటోంది.
పురాతన ఆలయాలను పరిరక్షించేందుకు పుణెకు చెందిన ‘శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్, రిలిజియస్ ట్రస్ట్’ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రముఖ దేవాలయాలను పురాతన పద్ధతిలో మరమ్మతులు చేపడుతోంది. తద్వారా వాటికి తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఆ ట్రస్ట్ ఛైర్మన్ పి.వెంకటేశ్వరరావు తెలుగువారు కావడంతో ఏపీలోని ఆలయాల పునరుద్ధరణకు సొంత నిధులతో మరమ్మతులు చేస్తున్నారు. పురావస్తుశాఖలో 38 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించి కట్టడాల పరిరక్షణ విభాగ సంచాలకుడిగా రిటైర్ అయిన ఆర్ఎస్ జామ్‌వాల్ ఈ ట్రస్ట్‌లో కీలకంగా వ్యవహరిస్తూ దేవాలయాల మరమ్మతులను పర్యవేక్షిస్తున్నారు.
ఎలా చేస్తారు?: బెల్లం, కరక్కాయలు, బెండకాయలు, ఒకరకమైన చెట్టు జిగురు, జనపనార, మినపపప్పు, సున్నాన్ని తొట్లులో వేసి 20 రోజులపాటు నానబెడతారు. ఈ పదార్థాలన్నింటినీ కలిపి చిక్కటి జిగురులా తయారుచేస్తారు. ఆ మిశ్రమాన్ని ఆలయాల పైకప్పుపై పూసి బంగాళాపెంకులు అతికిస్తారు. దీంతో ఆలయాల లోపలకు చుక్క నీరు కూడా రాకుండా ఉంటుంది. చోళులు, కాకతీయులు, పల్లవులు, విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ప్రసిద్ధ కట్టడాలకు, ఆలయాలకు ఈ విధానాన్నే అనుసరించేవారు. ఇలా మరమ్మతులు చేయడం వలన కనీసం 200 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి.
ప్రాచీన పద్ధతిలో పనులు: ఎలాంటి నిర్మాణం శిథిలం అవ్వడానికి అయినా ముఖ్యమైన కారణం వాటి పైకప్పు దెబ్బతినడమే. అదే విధంగా గాలిగోపురాలు, రాతి స్తంభాలు, దూలాలు వంటివి నీరు చొరబడితే పగుళ్లు ఏర్పడి కాలక్రమేణా అవి దెబ్బతింటాయి. వందల, వేల సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాలకు ఆనాడు ఉపయోగించిన పద్ధతుల్లో మరమ్మతులు చేస్తేనే అవి మరికొన్ని ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ‘శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్, రిలిజియస్ ట్రస్ట్’ పురాతన ఆలయాలు, కట్టడాల మరమ్మతు పనులను ఉచితంగా చేస్తోంది.
ఏయే దేవాలయాల్లో చేస్తారంటే?: శ్రీకాళహస్తిలో 6 కోట్ల రూపాయలతో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పైకప్పు పనులు చేశారు. సింహాచలంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన పైకప్పు పనులు పూర్తికావచ్చాయి. శ్రీశైలంలో 24,000 చదరపు అడుగుల్లో పైకప్పు, స్తంభాల మరమ్మతులు చేస్తున్నారు. తిరుపతిలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అలిపిరి పాదాల మండపానికి మరమ్మతుల కోసం 3 కోట్ల రూపాయల వరకు వెచ్చించనున్నారు.
పురావస్తుశాఖ ప్రమాణాల ప్రకారమే: పురావస్తుశాఖ ప్రమాణాల ప్రకారమే పనులు చేస్తున్నామని పురావస్తు శాఖ శాసనాల విభాగం సంచాలకుడు కె.మునిరత్నంరెడ్డి తెలిపారు. పురాతన పద్ధతులను అనుసరిస్తున్న కారణంగా ఆ ఆలయాలకు మరో 200 ఏళ్ల వరకు ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు.
పాండవ ప్రతిష్ఠిత శివాలయాలు- ఒక్కసారి దర్శిస్తే మోక్షం ఖాయం!
మహాభారత కాలం నాటి గుడి- పాండవులు రాత్రికిరాత్రే నిర్మించిన దేవాలయం- ఎక్కడుందో తెలుసా?

