Private Surveyors Training Programme in Telangana : రైతులు, ప్రభుత్వ స్థలాలు, పట్టాదారుల భూములు, చెరువుల హద్దులను గ్రామ నక్షలు, రెవెన్యూ రికార్డుల ద్వారా ఆధునీకరించేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రెవెన్యూ అధికారులు త్వరలోనే ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి చట్టం అమలవుతున్నందున రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, గౌతమ్‌లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు : రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 44 మండలాల్లో ఒక్కోదానికి 30 మంది చొప్పున ఎంపిక చేసిన సర్వేయర్లకు మే నెల 26 నుంచి జులై 26 వరకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 17వ తేదీ వరకూ మీసేవా కేంద్రాల్లో ఆసక్తి ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. శిక్షణ నిమిత్తం ఓసీలకు రూ.10 వేలు, బీసీ రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.25 వందల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
యజమానులకు చిక్కులు : గతంలో ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు 60 శాతానికిపైగా భూముల వివరాలు తప్పుగా నమోదైనట్లు పలు రకాల ఆరోపణలు వచ్చాయి. తమ స్థలాలను సర్వే చేయాలని యజమానులు రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. మండలంలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ భూములను సర్వే చేసి డివిజన్ చేయాలంటే కనీసం 60 నుంచి 90రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని సందర్భాల్లో తమ ఆడపిల్లల వివాహలకు భూములు అమ్ముకుందామంటే సరిహద్దులు సరిగ్గా లేకపోవడంతో సర్వేయర్ వచ్చి హద్దులు నిర్ణయించేంత వరకూ పెళ్లిళ్లు వాయిదాలు పడుతున్నాయి.
సర్వే ధ్రువీకరణ మాత్రమే : ట్రైనింగ్ అనంతరం రైతులు, ప్రైవేటు వ్యక్తులు తమ భూములను సర్వేయర్ల ద్వారా సర్వే చేయించుకోవచ్చు. గ్రామ నక్ష, రెవెన్యూ రికార్డులలో ఆయా భూముల సరిహద్దులు సక్రమంగా ఉన్నాయని శిక్షణ పొందిన సర్వేయర్లు ధ్రువీకరించనున్నారు. వారసత్వంగా వచ్చిన భూములను పంచుకున్నప్పుడు విభజించి సరిహద్దుల మ్యాప్‌ను ఇవ్వనున్నారు. వివాదాస్పద భూములుంటే మాత్రం ప్రభుత్వ సర్వేయర్లు వచ్చి నేరుగా పరిశీలించనున్నారు.
భూభారతి కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుంది : సీఎం రేవంత్ రెడ్డి
సమగ్ర భూ సర్వేపై దృష్టి సారించని ప్రభుత్వం... వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..