Regional Ring Road Build in Six Rows! : భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్)ని ఆరు వరుసల వెడల్పుతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం భూసేకరణపై ఎంత మేర ప్రభావం చూపుతుంది? మరింత అధిక విస్తీర్ణం సేకరించాల్సి వస్తుందా? లేక ఇప్పటికే గుర్తించిన భూమితోనే సరిపోతుందా? అనే విషయాలపై పరిశీలన జరిపి డిజైన్లు రూపొందించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
పాతిక సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని : పెరుగుతున్న వాహనాల రద్దీ నేపథ్యంలో వచ్చే పాతిక సంవత్సరాలను అవసరాలు దృష్టిలో పెట్టుకొని రహదారిని నిర్మించాలని యోచిస్తున్నట్లు ఓ ముఖ్య అధికారి పేర్కొన్నారు. రహదారి ఉత్తర భాగంలో ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే జాతీయ హోదా ప్రకటించటంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తర భాగంలో భువనగిరి, చౌటుప్పల్, గజ్వేల్, జగదేవపూర్, నర్సాపూర్, తూప్రాన్, సంగారెడ్డి వరకు 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో అమనగల్లు, చౌటుప్పల్, షాద్‌నగర్ మీదుగా సంగారెడ్డి వరకు 181 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 110 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం కానుంది. జగదేవపూర్, తూప్రాన్, గజ్వేల్, నర్సాపూర్ మీదుగా సంగారెడ్డి వయా కంది వరకు విస్తరిస్తారు. గజ్వేల్, భువనగిరి, తూప్రాన్, సంగారెడ్డి వద్ద జాతీయ, రాష్ట్ర రహదారులతో ఈ రింగురోడ్డు అనుసంధానం అవుతుంది. దీనివల్ల ఈ పట్టణాలు వాణిజ్యంగా అభివృద్ధి చెంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. స్థిరాస్తి వ్యాపారం పుంజుకోనుంది.
ప్రభుత్వంపైనే ఆశలు : ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటికే గజ్వేల్ శివారులోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ మధ్యలోంచి రహదారికి స్థలాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు 6 వరుసల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని యోచిస్తున్న సందర్భంలో కాలనీపై ప్రభావం చూపుతుందా? అనే సందేహాలు వ్యక్తం అమవుతున్నాయి. అర్బన్ పార్కు మధ్యలోంచి రహదారి నిర్మాణానికి భూమిని గుర్తించారు. పార్కుతో పాటు పక్కనే ఉన్న కాలనీవాసులు కొంత విస్మయానికి గురి అవుతున్నారు. అంతేకాక ఈ ప్రాంతంలోని భూములను మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌తో పాటు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రిం గురోడ్డు, రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కోసం మరోసారి భూ సేకరణ చేస్తుండటంతో రెండోసారి నిర్వాసితులు కానున్నామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
90 % పూర్తి : ఇప్పటికే సర్వే నిర్వహించిన అధికారులు సుమారు 5,000 ఎకరాల వరకు సేకరించేందుకు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 90 % భూసేకరణ పూర్తి చేసినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 110 కిలోమీటర్లు ఉండనుండటంతో 4500 ఎకరాలు సేకరించనున్నట్లు అంచనా.
ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ ప్రక్రియ ఆలస్యం కావొద్దు : సీఎం రేవంత్
రైతులకు ఉదారంగా పరిహారం - ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై సీఎం దిశానిర్దేశం