REAL TIME DASHBOARD FOR AP GOVT EMPLOYEES: పౌరసేవలను సులభతరం చేస్తూ సాంకేతికతను జోడించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల పని సామర్ద్యంపైనా నిశితంగా దృష్టి సారించింది. ప్రభుత్వ ఉద్యోగులు సమర్ధంగా సేవలందించేలా కార్యాచరణ చేపట్టనుంది. దీనికోసం ఉద్యోగుల పనితీరు సూచించేలా రియల్ టైమ్ డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తోంది. ఈ డ్యాష్ బోర్డులో ఉద్యోగుల హాజరు వివరాలతో పాటు దస్త్రాలు వెళ్లిన సంఖ్య, వాటి క్లియరెన్సుకు తీసుకున్న సమయం, పనితీరుకు సంబంధించిన అంశాలు తెలిసేలా వివరాలను డిస్ప్లే చేయాలని భావిస్తున్నారు. దీనికితోడు ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు కూడా ఈ రియల్ టైమ్ డ్యాష్ బోర్డు ఉపకరించనుంది.
ఉద్యోగులకూ కొన్ని బెంచ్ మార్క్స్: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సాంకేతికను పెద్ద ఎత్తున వినియోగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ అంటూ సంస్కరణలు తెచ్చింది. వీటితో పాటు పౌరసేవలను సులభతరంగా ప్రజలకు అందాలన్న లక్ష్యంతో అటు ఉద్యోగులకూ కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టాలని భావిస్తున్నారు. తద్వారా వేగంగా పౌరసేవలు అందటంతో పాటు సులువుగా వారికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికోసం ఉద్యోగుల పనితీరును సూచించేలా ఓ రియల్ టైమ్ డ్యాష్ బోర్డును ప్రభుత్వం రూపోందించాలని ఆలోచన చేస్తోంది.
తద్వారా ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లోనే నిశితంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ డ్యాష్ బోర్డు ద్వారా రోజువారీగా ఉద్యోగులు విధులకు హాజరయ్యే వివరాలతో పాటు దస్త్రాలు వెళ్లిన సంఖ్య, వాటిని క్లియరెన్సు చేసేందుకు తీసుకున్న సమయం లాంటి అంశాలను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. ఉద్యోగుల పనితీరును రియల్ టైమ్‌లోనే వారివారి విభాగాధిపతులు పరిశీలించి ఆదేశాలిచ్చే విధంగా ఈ కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేందుకు ఈ సరికొత్త విధానం అమలు చేయాలన్నది ఆలోచన.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు: పాలనకు అత్యంత కీలకమైన రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులకు సంబంధించిన వివరాలను సాధారణ పరిపాలన శాఖ ప్రస్తుతం నమోదు చేస్తోంది. అయితే ఇందులో ఉద్యోగుల హాజరు వివరాలు వరకూ మాత్రమే డ్యాష్ బోర్డులో నమోదు అవుతున్నాయి. ఇక నుంచి వారి వద్దకు వెళ్లిన ఇ-ఫైళ్లు, ఇతర వివరాలను కూడా నమోదు చేయనున్నారు. హెచ్ఓడీ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ తరహా వ్యవస్థను రూపకల్పన చేసేలా రియల్ టైమ్ డ్యాష్ బోర్డును సిద్ధం చేస్తున్నారు. రియల్ టైమ్‌లోనే ఉద్యోగుల పనితీరును బేరీజు వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రత్యేకించి ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు వీలుగా ఈ డ్యాష్ బోర్డు ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతి పౌరుడికి డిజిలాకర్ - అన్ని పత్రాలు వాట్సప్‌లోనే డౌన్లోడ్
రాష్ట్ర ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలి: ముఖ్యమంత్రి