RBI on Agricultural Gold Loan : వ్యవసాయం కోసం అంటూ బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను కేవలం పంట సాగు చేసే భూమి ఉన్న ప్రాంతంలోని బ్యాంకులే ఇవ్వాలని ఇటీవల ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ భూమి ఒకచోట ఉండి, రైతు మరో ప్రదేశంలో నివసిస్తున్న సందర్భంలో ఆ నివాస ప్రాంతంలోని బ్యాంకు బంగారం తాకట్టు పెట్టుకొని రుణం ఇస్తే ఆ మొత్తాన్ని ఆ భూమిలో, ఆ పంట సాగుకే వినియోగించినట్లు రైతు రుజువులు చూపించాలి. క్షేత్రస్థాయికి వెళ్లి బ్యాంకు అధికారులూ పరిశీలించాలి. వివరాలను ఆ భూమి ఉన్న సమీప బ్రాంచికి పంపించి అక్కడి సిబ్బందితో తనిఖీ చేయించాలని ఆదేశించింది. బ్యాంకులకు తనిఖీ వ్యవస్థ అంత పటిష్ఠంగా లేనందున గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని వారికి ఈ రుణాలను నిలిపేశారు. బ్యాంకు అధికార వర్గాలు ఈ విషయం తెలిపాయి.
ఈ రుణం తీస్తే రాయితీ వస్తుందని : పంట సాగు పేరుతో వడ్డీ రాయితీని పొందడానికి నగరాల్లో ఎక్కువ మంది ఈ రుణాలను తీసుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులో బంగారం తాగట్టు పెట్టుకుని రూ.100 రుణంపై సంవత్సరానికి 9 శాతం వడ్డీని వసూలు చేస్తుండగా వ్యవసాయం పేరుతో తీసుకుంటే అందులో 0.25 శాతం రాయితీ లభిస్తుంది. పైగా వ్యవసాయం పేరుతో తీసుకుంటే బంగారం విలువలో 85 శాతం సొమ్మును రుణంగా ఇస్తున్నారు. వ్యవసాయేతర అవసరం కోసం అని బంగారం తాకట్టు పెడితే కొన్ని బ్యాంకులు 65 శాతం సొమ్మే ఇస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాస్తవాలను పరిశీలించకుండా బ్యాంకులు వ్యవసాయం కోసమని బంగారం తాకట్టు రుణాలు ఇస్తున్నందున ఆ సొమ్ము ఇతర అవసరాలకు వాడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఆర్బీఐ నుంచి అందిన ఆదేశాలతో ఇక్కడ బ్యాంకులు ఈ రుణాలను నిలిపివేశాయి.
పంట రుణం తీసుకుని : బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాన్ని కచ్చితంగా ఏడాదిలోగా తిరిగి చెల్లించాలనే నిబంధనను అన్ని బ్యాంకులు అమలు చేస్తున్నాయి. వడ్డీ మాత్రమే కడితే కుదరదని, అసలు కూడా కట్టేసి మొత్తం రుణ ఖాతాను మూసివేయాలని స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే మళ్లీ తాకట్టు పెట్టి కొత్త రుణం తీసుకోవాలని చెబుతున్నాయి. భూముల యజమానులు బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం పేరుతో రుణం తీసుకుంటే దానిని ‘పంటరుణం’ అనే పద్దు కిందనే బ్యాంకులు చూపుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ అమలు సమయంలో ఈ విషయాన్ని పరిశీలించి బంగారం తాకట్టు రుణాలను ప్రత్యేకంగా చూపాలని సూచించినట్లు తెలుస్తోంది.
తనిఖీల్లో గుర్తించిన అధికారులు : హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక బ్యాంకు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని గత రెండేళ్లలో వ్యవసాయం కోసం అంటూ ఏకంగా రూ.5 కోట్లకు పైగా రుణాలిచ్చారు. వ్యవసాయ రుణాలకిచ్చే రాయితీ వాటికి వర్తింపజేశారు. వాస్తవానికి ఎవరూ ఆ సొమ్మును పంటల సాగుకు వాడుకోలేదని తేలింది. రియల్‌ఎస్టేట్ వ్యాపారాలకు, ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్లు తదుపరి తనిఖీల్లో బ్యాంకు అధికారులు గుర్తించారు.
చనిపోయిన రైతుల పేరుమీద రుణాల మంజూరు - కామారెడ్డిలో బ్యాంకర్ల అక్రమాలు
పంట రుణం.. పెను భారం.. రైతులకు బ్యాంకుల నోటీసులు
రైతుబంధు సొమ్మును ఇవ్వని బ్యాంకులు.. అన్నదాతలకు తప్పని తిప్పలు!