Ration Card e-KYC in AP : రేషన్‌కార్డు ఈకేవైసీ చేయించుకోవాలి లేకుంటే బియ్యం పంపిణీ నిలుపుదల చేస్తారు. ఇది రెండు నెలలుగా ఎక్కడ విన్నా వినపడుతున్న మాటలు. అయితే అసలు తాము ఈకేవైసీ చేయించుకోవాలో లేదో లేకపోతే ఎక్కడ చేయించుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 30 వరకు ఉన్న గడువును ఈ నెలాఖరు వరకు పెంచారు.
చిత్తూరు జిల్లాలో 1379 చౌక దుకాణాలుండగా అందులో 5.36 లక్షల కార్డులు, 16.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఇంకా 1.12 లక్షల మంది 8-9 శాతం మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇలాంటి వారు ఆన్‌లైన్‌లో ఈకేవైసీ స్టేటస్ సొంతంగా తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఇలా చూసుకోండి : గూగుల్ వెబ్ బ్రౌజర్‌లో ఈపీడీఎస్-1 అని నమోదు చేసి ఎంటర్ నొక్కాలి. అప్పుడు ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ అండ్ సివిల్ సప్లయిస్ ఏపీ’ అనే వెబ్‌సైటు తెరుచుకుంటుంది. దానిలో డాష్ బోర్డును ఎంపిక చేసుకోవాలి. దానిలో బియ్యం కార్డు విభాగంలో ఆరు రకాల ఆప్షన్లు ‘న్యూ’ అనే పేరుతో కనిపిస్తాయి. ఈపీడీఎస్ ఆప్లికేషన్ సెర్చ్ లేదా రైస్ కార్డు సెర్చ్ అనే గుర్తుల్లో ఒకదానిని క్లిక్ చేసి బియ్యం కార్డు నంబరు నమోదు చేస్తే అందులో ఉన్న పేర్లు వస్తాయి.

ఆయా పేర్ల ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని ఉంటే ఈకేవైసీ అయినట్లే అలా కాకుండా ఇంకా ఏమైనా ఉంటే ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. డీలరు లేదా ఎండీయూ వాహనం వద్ద ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలిపారు. అయిదు సంవత్సరాల లోపు, 80 ఏళ్లు పైబడినవారికి ఈకేవైసీ అవసరం లేదన్నారు. మిగిలిన వారంతా విధిగా చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ నెల 30 వరకే గడువు
- జిల్లాలో బియ్యం కార్డులు : 5.36 లక్షలు
- సభ్యుల(యూనిట్లు) సంఖ్య : 16.70 లక్షలు
- ఈకేవైసీ పూర్తికాని సభ్యులు : 1.12 లక్షలు
మీ రేషన్‌కార్డు ఈకేవైసీ స్టేటస్ చూసుకోండిలా- 30వ తేదీ వరకే గడువు