RAJIV YUVA VIKASAM SCHEME UPDATE : యువత స్వయం ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఇంటర్నెట్, మీ సేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు పడిగాపులు కాస్తున్నారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయిస్తుండటం, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని వస్తుందంటూ దరఖాస్తుదారులు వాపోతున్నారు. కాగా ఎల్లుండితో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనుంది.
పెండింగ్‌లో ఉన్న 6 లక్షలకు పైగా అర్జీలు : కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దారు ఆఫీసుల్లో ఆరు లక్షలకుపైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయవు. దీంతో ఈ పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించడంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ 14 లక్షల మందికి పైగా ఈ పథకానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది.
ఏళ్ల తరువాత పథకం రావడంతో : 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసే అవకాశం రావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పథకంపై ఆశలు పెట్టుకుంది. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ అప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. 10 రోజుల తర్వాత అంటే మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది.
సర్వర్‌పై ఒత్తిడితో : మీసేవ ద్వారా జారీచేసిన కుల ధ్రువీకరణపత్రాలు(క్యాస్ట్ సర్టిఫికెట్) ఇవ్వాలని స్పష్టంచేసింది. దీంతో గతంలో ఇచ్చిన కులధ్రువీకరణ పత్రాల స్థానంలో మీసేవ ధ్రువీకరణల కోసం యువత పెద్దఎత్తున దరఖాస్తు చేశారు. రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ(ఇన్కమ్) ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో లక్షల మంది ఆ పత్రాల కోసం మీసేవ కేంద్రాల్లో అప్లికేషన్లు ఇచ్చారు. ఆ విధంగా ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు 16 లక్షలకు పైగా క్యాస్ట్, ఇన్కమ్ ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో 10 లక్షల దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. సర్వర్‌పై ఒత్తిడితో రెవెన్యూ ఆఫీసుల్లో వీటి పరిష్కారం నిలిచిపోతోంది.
సెలవులు ఎక్కువగా రావడంతో : రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించి విధివిధానాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెలవులు ఎక్కువగా వచ్చాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి రోజుల్లో రెవెన్యూ ఆఫీసులు పనిచేయలేదు. ప్రభుత్వం ఈ నెల 14ను గడువుగా ప్రకటించగా. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ప్రభుత్వ ఆఫీసులు పనిచేయడంలేదు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని దాదాపు ఆరు లక్షల మంది ఆందోళన చెందుతున్నారు. ఈ పత్రాల కోసం శుక్రవారం యువత భారీసంఖ్యలో కార్యాలయాల వద్ద ఎదురుచూస్తుండటం కనిపించింది.
దరఖాస్తు సమయంలోనూ సర్వర్ సమస్యలు : రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించినటువంటి ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వస్తోందని యువత పేర్కొంటున్నారు.
'రాజీవ్ యువ వికాసం' నిబంధనల సడలింపు - ఆ సర్టిఫికేట్ లేకున్నా అప్లై చేసుకోవచ్చు
'రాజీవ్ యువ వికాసం పథకం' మార్గదర్శకాలు విడుదల - దరఖాస్తు చేయడానికి కావాల్సిన పత్రాలు ఇవే