10 రోజుల్లో 3 ముఠాల ఆటకట్టు - సైబర్ క్రైమ్ బృందం దూకుడు
బ్యాంకుల క్రెడిట్ కార్డుల యాక్టివేషన్ పేరుతో - సెల్ఫోన్లు దొంగిలించి అందులోని యూపీఐ పాస్వర్డులు మార్చుతూ - ఆరోగ్యశ్రీ ఖర్చులు రీఫండ్ చేస్తామంటూ ముఠాల మోసాలు - ఛేదించిన రాజన్న సిరిసిల్ల సైబర్ క్రైం

Published : August 8, 2025 at 2:53 PM IST
Online Frauds In Rajanna Sircilla : నేటి ఆధునిక కాలంలో సెల్ ఫోన్ లేకుండా మనుగడ కుదరడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుని నేరగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, సాంకేతిక అంశాలపై అవగాహనలేమి వంటి అంశాలను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటుంన్నారు. బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయిందంటూ, కేవైసీ చేయించాలని, అకౌంట్ అప్డేట్ చేయాలని, ఓటీపీ చెప్పాలని ప్రజలను నమ్మిస్తున్నారు.
ఇదేకాదు రుణాలు, ఉద్యోగం, వ్యాపారం, ప్రభుత్వ పథకాలు, ఆధార్ కేవైసీల పేరుతో రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా పది రోజుల్లో వివిధ మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న మూడు ముఠాల గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ క్రైమ్ బృందం ఛేదించింది. నేరాల పరిశోధనలో దూకుడు పెంచింది.
క్రెడిట్ కార్డుల యాక్టివేషన్ పేరుతో : హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ కలీం షాషా, రషీద్‌లు కోల్‌కతాలోని అంకిత్‌తో కలిసి పలు బ్యాంకుల క్రెడిట్ కార్డుల యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడేవారు. కస్టమర్ కేర్ కేంద్రం నుంచి మాట్లాడుతున్నామని ప్రజలను నమ్మించి సెల్ఫోన్లోకి ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేయించేవారు. ఆ తరువాత వారి ఫోన్‌ను హ్యాక్ చేసి వారి బ్యాంక్ ఖాతాలోని డబ్బు కాజేసేవారు. ఈ ముగ్గురిపై ఆరు రాష్ట్రాల్లో 60 కిపైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. రషీద్, అంకిత్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
యూపీఐ యాప్‌ల పాస్వర్డులు మార్చుతూ : పశ్చిమ బెంగాళ్‌కు చెందిన హరిబర్మన్ రైలులో ప్రయాణించే వారి నుంచి సెల్ఫోన్లు దొంగిలించేవాడు. అందులోని యూపీఐ యాప్‌ల పాస్వర్డులు మార్చుతూ బ్యాంక్ ఖాతాలోని నగదును కొట్టేసేవాడు. ఇలా మానాలకు చెందిన సిరికొండ శ్రీనివాస్ అతడి భార్య తిరుపతికి రైలులో ప్రయాణిస్తుండగా వారి ఫోన్ దొంగిలించాడు. ఆ ఫోన్ నంబరుకు యూపీఐ లింక్ చేసిన బ్యాంకు ఖాతా నుంచి రూ.5.12 లక్షలు ఇతర బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేశాడు. సైబర్ క్రైమ్ బృందం విజయవాడలో పట్టుకుంది.
ఆరోగ్యశ్రీ ఖర్చులు రీఫండ్ చేస్తామని : కడప జిల్లా జమ్మల మడుగుకి చెందిన సలీం మాలిక్, దిల్లీలో సతీశ్‌లు ఇద్దరూ స్నేహితులు. వీరు ఆరోగ్యశ్రీ నుంచి మాట్లాడుతున్నామని, ఆసుపత్రి ఖర్చులు రీఫండ్ చేస్తామని సెల్ఫోన్లో మాట్లాడేవారు. వారు పంపించే లింక్‌ను ఓపెన్ చేసి యూపీఐ పిన్ నమోదు చేయాలని సూచించేవారు. అలా నమోదు చేయగానే వారి ఖాతాల్లోని డబ్బు వీరి ఖాతాల్లోనికి జమ అయ్యేవి. మాలిక్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోని సైబర్ క్రైమ్‌లో 79 ఫిర్యాదులు ఉన్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ క్రైమ్ బృందం గుర్తించింది.
పూర్తిస్థాయిలో రాబట్టడం కష్టం : సైబర్ నేరాల్లో పోయిన సొమ్మును పూర్తిస్థాయిలో రాబట్టడం కష్టం. కారణం ఈ నేరాలన్నీ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతుంటారు. సిరిసిల్ల జిల్లాలో 2022, 2023, 2024 సంవత్సరాల్లో ప్రజలు సుమారుగా రూ.6.02 కోట్లు నగదును కొల్పోయారు. వీటిలో రూ.1.02 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు.
ఈ సంవత్సరం రూ.31.12 లక్షలు పోగొట్టుకోగా, దానిలో రూ.14.24 లక్షల నగదును బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేశారు. సైబర్ నేరగాళ్ల వద్ద ఉన్న డబ్బును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు అన్లైన్ లావాదేవీలు ఎక్కువగా జరిపే వారి వివరాలు సేకరిస్తారు. వారికి కమీషన్ ఆశచూపి ఇతర ఖాతాలకు మళ్లిస్తారు. ఇదే విధంగా నగదు బదిలీ జరిగిన ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేస్తారు. తర్వాత వీరు న్యాయ స్థానాన్ని ఆశ్రయించక తప్పదు.
తెలంగాణలోనూ 'సైబర్ డెన్'లు! - మనలో ఒకడిగా ఉంటూనే మనల్నే దోచేస్తున్నారు
‘సైబర్’ బాధితుల్లో ప్రైవేట్ ఉద్యోగులే అధికం - కారణాలు ఏంటంటే?

